మానవ అక్రమ రవాణా అరికట్టడానికి సమిష్టిగా కృషి చేయాలి:టి.గవర్నర్

- July 30, 2021 , by Maagulf
మానవ అక్రమ రవాణా అరికట్టడానికి సమిష్టిగా కృషి చేయాలి:టి.గవర్నర్

హైదరాబాద్: మానవ అక్రమ రవాణాను  అరికట్టడానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలి అని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు.డ్రగ్స్,ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మానవ అక్రమ రవాణా ద్వారా తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని,అమాయకులు జీవితాలు బలి అవుతున్నాయని గవర్నర్ ఆవేదన చెందారు.ప్రజ్వల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించిన  కౌంటరింగ్  హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఐదు రకాల హ్యాండ్ బుక్స్ ను ఈరోజు గవర్నర్ ఆవిష్కరించి, సంబంధిత డ్యూటీ అధికారులకు అందజేశారు.

మొత్తం మానవ అక్రమ రవాణాలో 46 శాతం మంది మహిళలు,19 శాతం మంది అమ్మాయిలు బాధితులు అవుతున్నారని ఆమె అన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఏ సమయంలోనైనా కనీసం రెండున్నర మిలియన్ల మంది ఈ మానవ అక్రమ రవాణాలో బాధితులు జీవితాలను  గడుపుతున్నారని డాక్టర్ తమిళిసై సమస్య తీవ్రతను వివరించారు.మానవ అక్రమ రవాణా నుండి కాపాడబడిన బాధితులను వివక్షకు గురి చేయకుండా వారి రిహాబిలిటేషన్ కు కృషి చేయాలని గవర్నర్ సూచించారు.బాధితుల సమస్యలను, అనుభవాలను ఆకళింపు చేసుకోవడం ద్వారా మానవ అక్రమ రవాణా ఎలా అరికట్టాలి సరైన ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరముందని గవర్నర్ వివరించారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణన్ ప్రజ్వల సంస్థ ద్వారా చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు.యూఎస్ కాన్సులేట్ సహాయంతో ప్రచురించిన ఈ హ్యాండ్ బుక్స్ ను ఉపయోగించుకొని బాధ్యత గల అధికారులు,సివిల్ సొసైటీ సభ్యులు మానవ అక్రమ రవాణా అరికట్టడానికి కృషి  చేయాలని గవర్నర్ సూచించారు.ఈ కార్యక్రమంలో సునీతా కృష్ణన్ తో పాటు యూఎస్ కాన్సులేట్ కు చెందిన అధికారులు, గవర్నర్ సెక్రటరీ కే.సురేంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com