ఇరాక్,సిరియాల్లో తీవ్ర నీటి ఎద్దడి

- August 24, 2021 , by Maagulf
ఇరాక్,సిరియాల్లో తీవ్ర నీటి ఎద్దడి

మిడిల్ ఈస్ట్: అంతర్యుద్ధం, ఉగ్రవాద దాడులతో చితికిపోయిన సరిహద్దు దేశాలు ఇరాక్, సిరియా ఇప్పుడు తీవ్ర కరవు కాటకాలతో అల్లాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, పెరిగిపోతున్న భూతాపంతో ఈ దేశాల్లో నీటి ఎద్దడి పెనుసమస్యగా మారబోతోందని, లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడనున్నారని అంతర్జాతీయ సహాయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. నీటి కొరత కారణంగా జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోతున్నాయని, దీనివల్ల విద్యుదుత్పత్తికీ అడ్డంకులు ఏర్పడుతున్నాయని, తద్వారా ఆరోగ్య వ్యవస్థ, అత్యవసర మౌలిక సదుపాయాలపైనా ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందని వెల్లడించాయి. రెండు దేశాలకూ కీలక జల వనరుగా వున్న యూఫరేట్స్‌ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో తగ్గడంతో రెండు దేశాల్లో కలిపి 1.2 కోట్ల మందిపై ప్రభావం పడిందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొన్నాయి. ఇరాక్‌లోని టిగ్రి నది కూడా దాహార్తి తీర్చలేకపోతోందని చెప్పాయి.

సుమారు 400 కిలోమీటర్ల వ్యవసాయ భూమిపై కరువు ప్రభావం పడిందని తెలిపాయి. ఉత్తర సిరియాలో 30 లక్షల మందికి విద్యుదుత్పత్తి వనరుగా ఉన్న రెండు జలాశయాలను మూసివేసే పరిస్థితులు ఏర్పడబోతున్నాయని హెచ్చరించాయి. ఇరాక్‌లోని కల్లోల పరిస్థితుల వల్ల లక్షల మంది నిరాశ్రయులు అయ్యారని, సిరియాలోనూ తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో మంది పారిపోతున్నారని, ఇప్పుడు రాబోతున్న నీటి ఎద్దడి విపత్తు మరింత మందిని నిరాశ్రయులను చేస్తుందని నార్వే శరణార్థి మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ కార్‌స్టెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారితో సతమతమవుతున్న ప్రజలపై నీటి ఎద్దడి ముప్పు మరింత ప్రభావం చూపనుందని కేర్‌ సంస్థ ప్రతినిధి నిర్వానా షాకీ పేర్కొన్నారు. వారిని రక్షించడానికి ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగాలని డానిష్‌ శరణార్థుల మండలి, యాక్టెడ్, యాక్షన్‌ అగెనెస్ట్‌ హంగర్‌ సంస్థల ప్రతినిధులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com