నెయ్యితో ఎన్ని లాభాలో...

- August 27, 2021 , by Maagulf
నెయ్యితో ఎన్ని లాభాలో...

ఘుమ ఘుమలాడే నెయ్యి వంటకి రుచినివ్వడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇంకా వివిధ హోం రెమెడీస్ కోసం నెయ్యిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. భారతదేశం యొక్క అత్యంత విలువైన ఆహారాలలో నెయ్యి ఒకటి. నెయ్యి పాల నుండి తయారవుతుంది. దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, బ్యూట్రిక్ యాసిడ్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

రాత్రి పడుకునే ముందు ఒక కప్పు వేడి పాలలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల నెయ్యి వేసుకుని తాగాలి. ఇది మలబద్దకాన్ని నివారించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. శ్వాస రంద్రాలు మూసుకుపోయి ముక్కు దిబ్బడ వేసినట్టు ఉంటుంది ఒక్కోసారి. ఆగకుండా వచ్చే తుమ్ములు కూడా ఇబ్బందికి గురి చేస్తాయి. ఆ సమయంలో నాలుక కూడా రుచిని కోల్పోతుంది. తలనొప్పి బాధిస్తుంది. అటువంటప్పుడు గోరు వెచ్చని నెయ్యిని రెండు చుక్కలు రెండు ముక్కు రంద్రాల్లో వెయ్యాలి. అప్పుడు నెయ్యి గొంతు వరకు ప్రయాణించి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

బొడ్డు చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడానికి నెయ్యి అద్భుతంగా పని చేస్తుంది. నెయ్యిలో ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఆమ్లాల ఉంటాయి. ఇవి శరీర కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ప్రతి రోజు ఆహారంలో ఒక టీస్పూన్ నెయ్యి వాడడం అత్యవసరం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇంటి నివారణ.. డయాబెటిస్‌తో బాధపడేవారికి అన్నం, గోధుమ రొట్టెలు అంత ఆరోగ్యకరం కాదు. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ పదార్థాల్లో ఓ స్పూన్ నెయ్యి వేసుకుని తింటే గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

చర్మానికి హోం రెమెడీ.. నెయ్యిని వివిధ రకాల బ్యూటీ కేర్ ఉత్పత్తులలో ఉపయోగిస్తుంటారు. దీనిలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో అద్భుతమైన ఏజెంట్‌గా పని చేస్తుంటాయి. అన్ని రకాల చర్మాలకు నెయ్యి అనుకూలంగా ఉంటుంది. నెయ్యిని ఉపయోగించి వేసుకునే ఫేస్ మాస్క్ ముఖ సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది. కావలసినవి: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టీస్పూన్ పసుపు ఈ పదార్ధాలను అన్నింటిని బాగా కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి ఓ 20 నిమిషాలు ఉంచాలి. తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే మీ ముఖంలో వచ్చిన మార్పుని మీరు గమనించవచ్చు.

జుట్టుకు హోం రెమెడీ నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది జుట్టుకు అద్భుతమైన హెయిర్ కండీషనర్‌గా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల నెయ్యికి ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి. 20 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో వెంట్రుకలను శుభ్రం చేయాలి. ఇది వెంట్రుకలను మృదువుగా చేస్తుంది.చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే దానికి పరిష్కారంగా నెయ్యిని నిమ్మరసంతో కలిపి రాయాలి. ఈ రెండూ కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి. పెదవులు పొడి బారి పగిలినట్లు ఉంటే రాత్రి పడుకునే ముందు కొద్దిగా పేరిన నెయ్యి తీసుకుని పెదవులకు రాయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తుంటే పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. అయితే మంచిది కదా అని ఆహారంలో అధిక మొత్తంలో తీసుకోకూడదు. రోజుకి ఓ స్పూన్ నెయ్యి అన్నంలో కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com