శ్రావణ మాసం..... .......... అల సింగపురంలో

- September 11, 2021 , by Maagulf
శ్రావణ మాసం..... .......... అల సింగపురంలో

(శ్రావణ మాసం సందర్భంగా.. సరదాగా రాసిన కథ ఇది.... ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు)

 ఇది ఒక పదిహేనేళ్ల  క్రితం నాటి మాట.... 

రాధా మాధవ్ ల పెళ్లి అయిన మూడు నెలలకే శ్రావణ మాసం రావటంతో. రాధ అమ్మ, అత్తగారు కలిసి రాధ చేత శ్రావణ మాసం మంగళ గౌరీ, వరలక్ష్మి వ్రతాలు, సాంప్రదాయబద్దంగా, ఘనంగా, భారీ భూరీగా దగ్గరుండి చేయించారు. 

పెళ్లి అయిన నాలుగు నెలలకి , మాధవ్ పని చేసే సాఫ్ట్వేర్ కంపెనీ అతనిని సింగపూర్ కి మూడు నెలలు ట్రైనింగ్ కి పంపింది.  రాధ అత్త వారింటిలోనే ఉండి పోయింది. ఆ మూడు నెలలు కి ఇంకో మూడు   నెలలు తోడు అయ్యి, మొత్తం ఆరు నెలలు అతను అక్కడే వుండి పోవాల్సి వచ్చింది ట్రైనింగ్ కి . కంపెనీ వాళ్ళు ఇంకో 2  ఏళ్ళు అక్కడే  పని చెయ్యమంటే. ఇంకెన్నాళ్లు ఉంటుంది ఒక్కతీ అని, అత్త మామలు, తల్లిదండ్రులు కలిసి రాధని పెట్టె బేడా సర్ది విమానం ఎక్కించి కాపురానికి పంపించారు.

వచ్చిన దగ్గర నుంచి సామాన్లు సర్దుకోవటం, ఇంటి పని  వంట పని లో మునిగిపోయి రాధ కూడా చుట్టూ పక్కల వాళ్ళ తో పరిచయం చేసుకోలా. రాధా మాధవ్ లకి  తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవరు లేరు  సింగపూర్లో.

రాధ కళ్ళు మూసి తెరిచే లోపల 2  నెలలు ఇట్టే గడిచి పోయాయి.  రానే  వచ్చింది శ్రావణ మాసం.  (అప్పటి లో వ్వాట్సాప్లు   లేవు). మాధవ్ బిడియస్తుడు, ఎవరి తోటి అంతగా కలవడు. ఆఫీస్ లో కూడా ఇండియన్స్ లేరు.  

రాధకి  వచ్చే ముందరే వాళ్ళ అత్తగారు గంభీరం గా చెప్పింది, ' ఇది తరతరాలు గా వస్తున్న మా ఇంటి ఆనవాయితీ, మంగళ గౌరీ వ్రతం కి ప్రతి యేడు వాయినాలు పెరుగుతాయి. తప్పకుండా ఇవ్వాలి. మనం మన వాళ్ళకే ఇవ్వాలి" అని అత్తగారు చాలా గట్టిగా చెప్పారు.

తల్లిప్రేమ కొద్దీ రాధా వాళ్ళ అమ్మ, పది ఇళ్ళకి వెళ్లి ఇవ్వాలి... ఎవరని వెతుకుతావు? ఎలా ఇస్తావు? బుట్ట వాయినం ఇచ్చెయ్యి' అని సలహా ఇచ్చింది.

'ఠాట్! ఠాట్' ఒకళ్ళకే ఇస్తే ఎలా? 10 మందికి ఇవ్వాల్సిందే....  ఆ 10 మంది ముత్తైదువుల ఇచ్చే దీవెన లుతో నువ్వు దీర్ఘ సుమంగళి గా ఉండాలి.... నా కొడుకు దీర్గాస్యుష్మంతుడు కావాలి'   అని అంది.


రాధకి నిద్ర పట్టట్లేదు, మంచం మీద అటు ఇటు దొర్లుతోంది. రేపటి నుంచే శ్రావణమాసం మొదలవ్వుతోంది. అందిట్లోనూ మొదటి మంగళ వారం .. తాను నోము పట్టాలి.. లెక్క ప్రకారం 10 మందికి వాయనం ఇవ్వాలి.

 'కాటుక బాగా పారాలి, జ్యోతులు బాగా చెయ్యాలి, వంగుని కాళ్ళు పట్టుకుని దీవెనలు తీసుకోవాలి.'. అంటూ కళ్ళు పెద్దవి చేసి సీరియస్ గా మొహం పెట్టుకుని చెబుతున్న అత్తా గారి మొహమే కలలో  కనపడింది. కళ్ళు మూసినా తెరిచినా ఆవిడే కనపడుతోంది రాధకి.

'మన వాళ్ళు ఎవరో ఎలా తెలుస్తుంది ? ఒకళ్ళు కూడా పరిచయం కాలేదే' అని రాధ తలపట్టుకు కూర్చుంది.

  
 పొద్దున్నే ఐదు గంటలకి  లేచి వంట ప్రయత్నం మొదలు పెట్టింది. జోరున వాన పడుతున్నా  గొడుగు వేసుకుని మాధవ్ వెళ్లి  పళ్ళు, పూలు, కొబ్బరి కాయ తెచ్చాడు.

 'మీకు నా మీద ఎంత ప్రేమ అండి.. ఇంత జడి వాన లో వెళ్లి తెచ్చారు' అని రాధ అంటే.

'కాళ్ళ కి దణ్ణం పెడతావని' అని నాలిక కరుచుకున్నాడు.

 ఇంతలో ఫోన్ మ్రోగింది.. రాధా వాళ్ళ అమ్మ... ఎవరో తెలిసిన వాళ్ళ దూరపు చుట్టాలు, రాధా వాళ్ళ ఇంటికి నాలుగు స్టేషన్ ల  అవతల వున్నారని తెలిసింది. వాళ్ళ ఇంటికి వెళ్లి వాయనం ఇస్తే మిగతా ఇంకొంతమంది అడ్రస్లు  చెప్తానని ఆవిడ అంది అందుకని అది  చెప్పటానికి రాధ అమ్మ ఫోన్ చేసింది.

 త్వరగా మాధవ్ కి బాక్స్ కట్టి ఇచ్చేసి.. అతను ఆఫీస్ కి వెళ్ళాక, పూజ చేసే  ప్రయత్నంలో పడింది.

వాళ అమ్మ చెప్పిన వాళ్ళ కి, ఇంకో  తొమ్మిది మందికి  వాయనం ఇద్దామని బయల్దేరింది  .. ఎర్ర రంగు గళ్ళ పట్టు చీర పెద్ద బోర్డర్ తో ఉన్నది, పూజ చేసి హడావిడి గా బయల్దేరడం తో ...మొహం  సరిగ్గా లేకుండా, చెదిరిన జుట్టుతో , కాళ్ళకిపసుపు రాసుకుని, చీర కాళ్ళకి అడ్డం  పడకుండా కొంచెం పైకి పట్టుకుని ...ఆవిడకి ఇద్దామని పళ్ళు, తమలపాకులు, జ్యోతులు, శనగలు అన్ని ఒక బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుంది.

 కాటుక ఇవ్వాలి కదా అని అట్లకాడ బాగ్ లో పెడితే కాటుక చెరిగి పోతుంది అని చేతితో పట్టుకుని, అన్ని  తీసుకుని ఆదరా బాదరాగా ఎం ఆర్ టీ ఎక్కుదామని  స్టేషన్ కి వచ్చింది. 

 స్టేషన్ లో మిగతా ప్రయాణికులు తన వంక వింతగా చూస్తున్నారు. ఎం ఆర్ టీ రాంగానే ఎక్కింది.. 

'ఇఫ్ యు సి ఎనీ సస్పీసీఎస్ లుకింగ్ పర్సన్  ఆర్ థింగ్, ప్లీజ్ ఇన్ఫార్మ్ అవర్  స్టాఫ్ ఆర్ ప్రెస్ ది ఎమర్జెన్సీ బటన్' అని ఇంగ్లీష్, చైనీస్, మలయ్,  తమిళ్ భాషల లో ప్రకటన వినపడుతోంది. 

తల ఎత్తి  చూసే సరికి తనని , తన చేతులో అట్లకాడని తోటి ప్రయాణికులు  మార్చి మార్చి చూస్తున్నారు. 
ఒకసారి తన బాగ్ వంక చూసింది,  "అయ్య బాబోయి! ఆపిల్ , ఆరంజ్ పండ్లు  బయటనుంచి చూడటానికి నాటు బాంబులు  లాగా కనపడుతున్నాయి"  అని రాధ మనసులో అనుకుంది. తన గుండె  దడదడ లాడింది.

'కొంపదీసి వీళ్ళు  కానీ తనని చీర కట్టిన బెల్ట్ బాంబు థాను లా అనుకోవట్లేదు కదా.  టెర్రరిస్ట్ అనుకుని పోలీస్ లకి పట్టిచ్చేయ్యారు కదా అని , నెక్స్ట్ స్టేషన్ లో ట్రైన్ ఆగంగానే దిగిపోయి. పరుగు లాంటి నడక తో బయటకి వచ్చి మాధవ్ కి ఫోన్ చేసి విషయం చెప్పింది. 

'నువ్వు అర్జెంటుగా ఆ అట్లకాడ ప్లాస్టిక్ బాగ్ లో పెట్టేయ్యి..' అన్నాడు.

'మరి కాటుక చెరిగిపోతుంది కదా?' అని అంది

'అందుకని జనం హడిలి చచ్చేట్టు, ఊరంతా అమ్మవారి చేతిలో త్రిసూలం లాగా    పట్టుకుని తిరుగుతావా?   అన్నాడు. 

ఆ బాగ్ ని బాగ్ లాగా  పట్టుకో ... బెల్ట్ బాంబు లాగా ముందర, వెనకాల తగిలించుకోకు' అన్నాడు .

'మీరు అర్జెంటు గా వచ్చి నన్ను వాయనాలకి తీసుకు వెళ్ళండి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా, మీ కోసమే కదా....... మీ దీర్ఘయ్షు కోసమే కదా,...... మీ అమ్మ గారు, మా ఇంట్లో తరతరాల  ఆనవాయితీ ఉందంటేనే కదా'......అంటూ ఏడుపు లంకించుకుంది
.. 

మాధవ్ ఆ ఏడుపు విని ఖంగారు పడి  ఆఫీస్ లో కుర్చీ నుంచి జారిపడినంత పని అయ్యింది.

 .. 'ఆపు.. ఆపు.. నీ ఏడుపు చూసి రోడ్ మీద ఎవరన్నా ఇంకేమన్నా అనుకుంటారు .. నేను ఆఫీస్ కి సెలవు పెట్టి వచ్చేస్తున్నా... నువ్వు ఇంటికి వచ్చేయి టాక్సీ లో 'అన్నాడు.

ఇద్దరు,ముగ్గురు  టాక్సీ వాళ్ళని ఆపటానికి ప్రయత్నించింది, స్లో అయినట్టు అయ్యి స్పీడ్ పెంచి మళ్ళీ వేగం గా వెళ్లి పోయారు. మొత్తానికి ఒక  టాక్సీ డ్రైవర్ ఆపాడు ...ఇంటికి వచ్చింది.

ఇంటికి చేరేసరికి  తోటకూర కాడ లాగా ఒడిలి పోయింది. గబగబా
 నాలుగు మెతుకులు తిని ... ముత్తైదువులని  తన ఇంటికే పిలుద్దామంటే వాళ్ళ అందరికి తాను ప్రసాదాలు, టిఫిన్లు చెయ్యలేదు.

 'ఐడియా!  వచ్చే వారం గుడికి వెళ్ళిస్తే .. ఔను .... ఎలా తెలుస్తుంది ఎవరు ఎవరో అని ?  

ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు ధ్యానముద్రలో  కూర్చుని... పరిష్కారం వెతుకుతుంది. తన చుట్టాలు ఇంటికి  వెళ్ళినప్పుడు అందరి ఇళ్ల లోను పాండ్స్ పౌడర్ డబ్బా, మైసూర్ శాండల్ సోప్  చూసినట్టు గుర్తు...  
 'నా లోని అతీత శక్తులని మేల్కొలుపుతా , బయటకి గుడికి వెళ్ళినప్పుడు...  వాళ్ళ దగ్గర పాండ్స్ పొడి , మైసూర్ శాండల్ సోప్ వాసనలు వస్తే .. వాళ్ళు, మా వాళ్ళ ని.. ఇట్టే పట్టేస్తా....  అని గట్టిగా ఊపిరి పిలుస్తూ... వదులుతూ. బయటకి గట్టిగా స్వగతం గా ..." హా ...ఇది నిజం ముమ్మాటికీ" ...  అని అంటుంటే   

'కె ...వ్వు'... మన్న కేక వినపడింది .. 

తపోభంగమైన ముని పత్ని లాగ కళ్ళు పెద్దవి చేసి చూసేసరికి ..   

 'ఏ ఏ  ఏ  ఏ.. విటా  అవతారం' అని పరుగులాంటి నడకతో బాత్రూం లోకి  వెళ్లి తలుపు బిడాయించాడు మాధవ్.

ఎందుకు అంత ఖంగారు పడ్డాడో  అని అర్ధం కాక   వెళ్లి అద్దం లో చూసుకునేసరి.. తన జుట్టు  చెదిరిపోయి, బొట్టు చెరిగి. నుదుటి మీద పులిమినట్టుంది.
 
 పొద్దున్న నోము చేసాక  భక్తి పారవశ్యం తో కళ్ళకిపట్టించిన కాటుక, కళ్ళ చుట్టూ వలయాకారం లో అంటుకు పోయి..... పూర్తి రూపు రేఖలు మారిపోయి.... టోటల్ గా...... చంద్రముఖి అవతారం లోకి వచ్చింది .....

తనని తాను అద్దం లో చూసుకుంటూ .. ..'లక.. లక...లక..లక  .. అని తన నోట్లోంచి గభాలున, అప్రయత్నంగా   అనేసరికి 
  
బాత్రూం లోంచి మాధవ్ మళ్ళీ......' కెవ్వు..కెవ్వు..'మంటూ అరిచాడు.  

ఆ అరుపులకి  తాను కూడా ఉలిక్కి పడి.. గబగబా ఇంకో బాత్రూం లో కి వెళ్లి మొహం శుభ్రం గా కడుక్కుని వచ్చింది.

ఒక అరగంట కి నీరసం గా బయటకి వచ్చిన మాధవ్..నిస్సత్తువ గా వెళ్లి సోఫా లో కూచుంటే ప్లేట్లో రబ్బర్ లాంటి గారెలు,  చప్ప గా వున్న పాయసం, పులుపు రొడ్డుగా ఉన్న పులిహోరని తెచ్చి ఇస్తే మారు మాట్లాడకుండా తినేసాడు.    

కొంతసేపు తర్వాత ....కొంచెం తేరుకుని మాధవ్  అన్నాడు ..  'ముందర నువ్వు బొట్టు సైజు తగ్గించు, కళ్ళకి  కి లైట్ గా పెట్టు కాటుక,... పామేయమాకు...... కాటుక కళ్లకే అనుకుంటా పెట్టుకునేది'  

ఒక గంట తర్వాత,  బీరకాయ పీచు చుట్టరికం ఉన్న ఆ  అమ్మాయి ఇంటికి, రాధా మాధవ్ లు టాక్సీ మాట్లాడుకుని వెళ్లారు.  ఇంటి- ఇంటి కి వేరే టాక్సీ మారుతూ, వాయినాలు ఇచ్చి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9  అయ్యింది....... టాక్సీ బిల్  300 డాలర్స్ అయ్యాయి. మాధవ్ గుండె గుభేలు మంది.. 

'ఈ లెక్కన ఇంకో 3  వారాలు ఇవ్వాలంటే, నా జీతంలో  మూడవ వంతు టాక్సీలకే అయిపోతుంది.. వచ్చే ఏడాది 15  ఆ తర్వాత 20   .. ఆ తర్వాత. 25  అంటూ గాలిలో లెక్కకు వేస్తూ ... 
"ఆమ్మో!... ఆమ్మో!" అంటున్న   మాధవ్  మాటలు విని  

'మీ కోసమే కదా....... మీ దీర్ఘయ్షు కోసమే కదా,...... మీ అమ్మ గారు, మా ఇంట్లో తరతరాల  ఆనవాయితీ ఉందంటేనే కదా......అంటూ ఏడవటం మొదలు పెడుతున్న రాధని చూసి రెండు  చేతులు జోడించి 
'అమ్మ.. మహా తల్లి.. ఏడుపు ఆపు .. 'అంటూ సోఫా లోంచి నేల మీదకి జారాడు. 

రాని కన్నీళ్లని తుడుచుకుంటూ... గట్టి గా ముక్కు ఎగబీలుస్తూ ...."అదే మా  ఊళ్ళో అయితే.. ఎంచక్కా ఒకే రిక్షా లో ఊరంతా తిరిగేయ్యచ్చు..  రెండు వందల రూపాయల తో
 అయిపోతుంది...ఏమి సింగపూరో ఏంటో " అంటూ... కొంగు ఒఖ్ఖ  దులుపు దులిపి
వంటింట్లోకి వెళ్ళింది  రాధ.

--జానకి జ్యోతి విశ్వనాధ(సింగపూర్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com