మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ఓటర్లను ఆకర్షించడానికి డీఎంకే కసరత్తు

- March 16, 2016 , by Maagulf
మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ఓటర్లను ఆకర్షించడానికి డీఎంకే కసరత్తు

మేనిఫెస్టో ద్వారా రాష్ట్ర ఓటర్లను ఆకర్షించడానికి డీఎంకే ముమ్మరంగా కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో ఉచితాల జాబితాలో ఉచిత కేబుల్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ను చేర్చే అంశాన్ని పరిశీలిస్తోంది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారులతో ఈ విషయమై చర్చిస్తోందని, వాటి అమలుకు సానుకూలత ఉన్నట్లు తేలితే వెంటనే వాటిని ఉచితాల జాబితాలో చేర్చడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్న డీఎంకే అందులో భాగంగా మేనిఫెస్టో రూపకల్పనపై కూడా గట్టి కసరత్తులే జరిగాయి.ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకర్షించడంలో వాగ్దానాలే కీలకంగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యలు, ఓటర్ల నాడి తెలుసుకునేందుకు కనిమొళి, దురైమురుగన్‌ తదితరుల నేతృత్వంలో మేనిఫెస్టో రూపకల్పన బృందాన్ని డీఎంకే అధిష్ఠానం ఏర్పాటు చేసింది. ఈ బృందం అందించిన నివేదిక ప్రకారం రెండు రకాల మేనిఫెస్టోలను అధిష్ఠానం రూపొందించిందని, జనరంజక ఉచితాలతో ఓ మేనిఫెస్టో, భారీ ప్రయోజనాలతో కూడిన ప్రాజెక్టులు, హామీలతో రెండో మేనిఫెస్టో సిద్ధం చేశారని భోగట్టా. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలతో మేనిఫెస్టోలో మార్పుల అవసరం ఉందని, మరికొన్ని జనరంజక పథకాలను ఉచితాల్లో చేర్చాలని డీఎంకే అధిష్ఠానం నిర్ణయించి ఆ మేరకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వాషింగ్‌ మిషన్‌, ఫ్రిజ్‌లను ఉచితంగా అందించే అంశాలను పరిశీలించింది.
'బ్రాడ్‌బ్యాండ్‌'పై కసరత్తులు సాంకేతిక విప్లవంతో ప్రస్తుతం ఇంటింటికీ కేబుల్‌ టీవీ లేదా డీటీహెచ్‌, ఇంటెర్నెట్‌ కనెక్షన్లు అందుబాటులోకి వస్తుండటంతో ఓటర్లను మూకుమ్మడిగా ఆకర్షించడానికి ఉచిత కేబుల్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ అంశాలపై డీఎంకే అధిష్ఠానం దృష్టి సారించింది. ఇంటింటికీ ఉచిత కేబుల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ను అందిస్తామని రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ పథకం సాధ్యాసాధ్యాలను గురించి విశ్రాంత ఐఏఎస్‌ అధికారులతో చర్చిస్తున్నారని, పథకం సాధ్యమేనని తేలితే వెంటనే దానిని మేనిఫెస్టోలో చేర్చాలని డీఎంకే అధిష్ఠానం నిర్ణయించినట్లు వినికిడి. అలాగే మహిళా స్వయం సహాయక బృందాలకు 'స్మార్ట్‌ ఫోన్లు', చెన్నైలోని అడయారు, కూవం నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా పక్కా గృహాలు, తొలిసారిగా ఇంటిస్థలాన్ని కొనుగోలు చేసేవారికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల్లో రాయితీ, ఇంజినీరింగ్‌, వైద్యవిద్య విద్యార్థులకు పలు రాయితీలు తదితర జనరంజక పథకాలనూ మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. త్వరలో మేనిఫెస్టోకు తుదిరూపం ఇచ్చి దానిని విడుదల చేయనున్నట్లు డీఎంకే వర్గాల సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com