దుబాయ్‌లో మన ‘ల్యాండ్ మార్క్’: అత్యద్భుతం ఈ హిందూ దేవాలయం.!

- September 20, 2021 , by Maagulf
దుబాయ్‌లో మన ‘ల్యాండ్ మార్క్’: అత్యద్భుతం ఈ హిందూ దేవాలయం.!

దుబాయ్‌: హిందుత్వం మతం మాత్రమే కాదు. అది ఒక ధర్మం.. జీవన విధానం అని చెబుతారు పండితులు. భారతదేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో హిందూ దేవాలయాలున్నాయి. కొన్ని ఇస్లామిక్ దేశాల్లో కూడా అత్యద్భుతమైన హిందూ దేవాలయాలున్నాయి. యూఏఈ.. ఈ అత్యద్భుత ఇస్లామిక్ దేశంలో కూడా రెండు ప్రముఖ హిందూ దేవాలయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఒకటి అబుధాబిలో. ఇంకోటి దుబాయ్‌లో.. ఇవి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను అనుసరించి.. అత్యంత అందంగా రూపుదిద్దుకుంటున్నాయి.

అబుధాబిలో నిర్మితమవుతున్న హిందూ దేవాలయం 2023 నాటికి పూర్తవుతుంది. దుబాయ్‌లో నిర్మితమవుతున్న దేవాలయం 2022 విజయదశమి నాటికే అందుబాటులోకి రానుంది. విజయదశమి.. ఆ వెంటనే వచ్చే, దీపావళి పర్వదినాలు హిందువులకు ఎంత ప్రత్యేకమైనవో అందరికీ తెలిసిందే. ఈ పండుగలు వచ్చే ఏడాది దుబాయ్ దేవాలయంలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దుబాయ్ సిటీ పరిధిలోని జబెల్ అలీ లో నిర్మితమవుతున్న ఈ దేవాలయం, అత్యంత ప్రత్యేకమైనది.

52 శాతం పనులు పూర్తి..
సింధి గురు దర్బార్ దేవాలయం, ట్రస్టి రాజు షరాఫ్ మాట్లాడుతూ, ఈ అత్యద్భుత దుబాయ్ దేవాలయ నిర్మాణం 52 శాతం పూర్తి కావచ్చిందని అన్నారు. నిర్మాణం పూర్తయితే, ఈ అద్భుత కట్టడం షేక్ జాయద్ రోడ్ పై నుండి అత్యంత సుందరంగా కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న స్వచ్ఛమైన ఇత్తడి (బ్రాస్) కలశం, సూర్య కిరణాలతో దేదీప్యమానంగా కనిపించనుంది. ఈ కట్టడాన్ని ల్యాండ్ మార్క్ భవనంగా ముందు ముందు అందరూ గుర్తించే అవకాశం ఉంటుంది.

అనుకున్న సమయం కంటే, అత్యంత వేగంగా నిర్మాణం
ఈ నిర్మాణం పూర్తయితే, 1500 మంది భక్తులు ఒకేసారి దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం 100 మందికి పైగా కార్మికులు ప్లాస్టరింగ్ పనుల్లోనూ, ఇటుకతో పూర్తి చేసే చిన్న చిన్న పనుల్లోనూ నిమగ్నమై ఉన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్రధాన ప్రార్ధనా మందిరం పై భాగం పనులు జరుగుతున్నాయి. 5000 చదరపు అడుగుల ప్రార్ధనా స్థలం సంసిద్ధమవుతోంది. చేతితో చెక్కిన 15 తెలుపు మరియు నలుపు మార్బుల్ దేవతా మూర్తుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. వీటిని భారతదేశంలో తయారు చేయించి, యూఏఈకి ఈ ఏడాది చివరలో తీసుకు రానున్నారు.  

మహాశివుడి విగ్రహ స్థాపన
ఈ దేవాలయం కేంద్ర భాగంలో మహా శివుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. హనుమంతుడు, గణపతి సహా పలువురు దేవతా మూర్తుల్ని ఈ దేవాలయంలో వేర్వేరు విభాగాల్లో ఏర్పాటు చేస్తారు. సిక్కులకు సంబంధించిన పవిత్ర గ్రంధం ‘గురుగ్రంధ్ సాహెబ్’ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

స్కైలైట్.. ఇదొక అద్భుతం
దేవాలయంలో స్కైలైట్ మరో అద్భుతం. రెండు డజన్ల పెద్ద పెద్ద అలంకార గంటల్ని అమర్చుతున్నారు. ప్రార్ధనా మందిరం మధ్య భాగంలో పైన ఇవి కనిపిస్తాయి. ఓపెన్ టెర్రస్, ప్రార్ధనా ప్రాంతం చుట్టూ ఉంటుంది. ఆయా భక్తుల కోసం ప్రత్యేకంగా దీన్ని తీర్చి దిద్దారు.
ప్రార్ధనా మందిరం సహజమైన కాంతితో సరికొత్త అనుభూతినిస్తుంది. సహజమైన రంగులతో వీనుల విందైన సంగీతంతో మంత్రోచ్ఛారణ జరుగుతూ మనసుకు ఆహ్లాదకరమైన రీతిలో ఉంటుంది. నిర్మాణంలో ఉన్నప్పుడే ఆయా విభాగాలను పరిశీలిస్తున్నప్పుడు మానసిక ఉల్లాసాన్ని పొందానని రాజు షరాఫ్ చెప్పారు. అదే అనుభూతి భక్తులందరికీ కలుగుతుందనీ, భక్తి భావంలో ప్రతీ ఒక్కరూ మమేకమవుతారని ఆయన పేర్కొన్నారు.

బ్యాంకెట్ హాల్స్, కిచెన్, మెడిటేషన్, టీచింగ్ రూమ్స్ అలాగే వివాహాలు, పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయిక్కడ. కారు పార్కింగ్ కోసం కేటాయించిన రెండు బేస్‌మెంట్లలో పెయింటింగ్ పూర్తవుతోంది. ఈ దేవాలయ ప్రాజెక్టు నిర్మాణం కోసం 60 నుండి 65 మిలియన్ దిర్హాములు ఖర్చవుతుందని అంచనా.

కమ్యూనిటీ మెంబర్స్ సహకారం చాలా ప్రత్యేకం
జైపూర్ అలాగే నార్త్ వెస్ట్ ఇండియా అలాగే చెన్నై నుండి 15 దేవతా విగ్రహాలను తెప్పించేందుకు కమ్యూనిటీ మెంబర్స్ సహకారం అందిస్తున్నారు. అనుకున్నదానికంటే ముందుగా పనులు పూర్తి కావడానికి కమ్యూనిటీ మెంబర్స్ అందిస్తున్న సహకారమే ప్రధాన కారణం. సమయం అలాగే, ఖర్చు కూడా ఈ సహకారం వల్ల ఆదా అవుతోంది. ఇది కమ్యూనిటీ ప్రాజెక్టు, కమ్యూనిటీ ఖర్చు కూడా.

పెద్ద సంఖ్యలో వాలంటీర్లు స్వచ్చందంగా ముందుకొచ్చి తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. విలువైన సలహాలిస్తున్నారు. నిర్మాణ సామాగ్రి చాలా వరకూ స్థానికంగానే సేకరించబడుతోంది. స్థానిక కంపెనీలను ప్రోత్సహించే దిశగా స్థానికంగానే నిర్మాణ సామాగ్రిని సమీకరించుకుంటున్నామని రాజు షరాఫ్ చెప్పారు.

ఈ దేవాలయం తాలూకు ప్రహారీ గోడ సిక్కు గురుద్వారతో పంచుకుంటుంది. ఈజిప్టియన్ కాప్టిక్ ఆర్డోడాక్స్ చర్చి పక్కనే ఉంది. బర్ దుబాయ్ ప్రాంతంలోని హిందూ దేవాలయానికి చెందిన జనరల్ మేనేజర్ గోపాల్ కోకాని మాట్లాడుతూ జబెల్ అలీ ప్రాంతం ఎంతో ప్రత్యేకమైనదనీ అన్నారు. వలసదారులకు ఇది చాలా గొప్ప గౌరవమనీ మతపరమైన స్వేచ్ఛ వారికి యూఏఈలో లభిస్తోందనీ అన్నారు. కన్నులకు అత్యంత సుందరంగా కనిపించే ఇంత గొప్ప దేవాలయం నిర్మాణానికి అనుమతించిన యూఏఈ పాలకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com