రివ్యూ: రిపబ్లిక్

- October 01, 2021 , by Maagulf
రివ్యూ: రిపబ్లిక్

చిత్రం: రిపబ్లిక్ 
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ తదితరులు నిర్మాతలు: జే భగవాన్, జే పుల్లా రావు
బ్యానర్: జీ స్టూడియోస్, జే బీ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ఎమ్ సుకుమార్
రచన, దర్శకత్వం: దేవా కట్ట

'ప్రస్థానం' లాంటి సినిమా తర్వాత దేవా కట్టా నుంచి మళ్లీ ఆ స్థాయి సినిమా రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇలాంటి సమయంలో వరస విజయాలతో జోరు మీదున్న సాయి ధరమ్ తేజ్‌తో ఈయన చేసిన ప్రయత్నం రిపబ్లిక్. కొన్ని రోజులుగా ఈ చిత్రం గురించి బాగానే చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:
పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్నప్పటి నుంచి నిజాయితీగా బతకాలనుకుంటాడు. దానికోసం తండ్రితో కూడా గొడవలు పడుతుంటాడు. దాంతో పాటు సమాజంలో జరిగే తప్పులను చూసి నిలదీస్తుంటాడు. పొల్యూట్ అయిన సమాజాన్ని మార్చాలనే ఉద్దేశంతో ఉంటాడు. అందుకే మంచి ఉద్యోగం వచ్చినా కూడా వదిలేసుకుని మరీ కలెక్టర్ అవుతాడు. కలెక్టర్‌గా ఛార్జ్ తీసుకున్న తర్వాత తనదైన నిర్ణయాలతో ముందుకు వెళ్తాడు. ముఖ్యంగా ఓ చేపల సరస్సు కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటారు. దానిపై ఫోకస్ చేస్తాడు అభిరామ్. ఈ ప్రయాణంలో ఆయనకు అడ్డుగా అవినీతి పరమైన రాజకీయ నాయకురాలు విశాఖ వాణి (రమ్యకృష్ణ) నుంచి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పంజా అభిరామ్ వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు.. సొంతూరిలోని సరస్సు గొడవలను ఎలా ముగించాడు.. చివరికి ఏమైంది అనేది అసలు కథ..

కథనం:
కొందరు దర్శకుల సినిమాలు ఎలా ఉంటాయో ముందే క్లారిటీ ఉంటుంది. ఆ మైండ్ సెట్ తోనే థియేటర్ కి వెళ్ళాలి.. రిపబ్లిక్ సినిమాను చాలా మంది చూసిన కోణం అదే. దేవా కట్ట నుంచి పూర్తిస్థాయి కమర్షియల్ సినిమా ఊహించడం కష్టమే. అలాగని మరీ అర్థం కాని సినిమా అయితే తీయలేదు. మనం ఎలాంటి వ్యవస్థలో ఉన్నాం.. ఎలాంటి శక్తుల మధ్య బతుకుతున్నాం.. అందులో మనం తెలిసి చేసే తప్పు ఎంత ఉంది.. రాజకీయ నాయకులు ప్రజలను ఎలా వాడుకుంటున్నారు.. ఇలాంటి నిజాలను మనం ఒప్పుకోలేనంత పచ్చిగా చూపించాడు దేవా కట్ట. వీటి చుట్టూ అల్లుకున్న కథ రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్ తన కెరీర్లో చేసిన హానెస్ట్ అటెంప్ట్ ఇది. ఇందులో కొన్ని సన్నివేశాలు మనం రోజు పేపర్లో చదివేవి.. వార్తల్లో చూసేవి. నిజాయితీగా పని చేయాలి అనుకునే అధికారులకు.. వ్యవస్థలో ఎలాంటి ఒత్తిళ్ళు ఉంటాయో చూపించాడు దేవా కట్టా. ఈ క్రమంలో ఎవర్ని ఆయన ప్రతినాయకుడిగా చూపించలేదు. కేవలం వ్యవస్థలో ఉన్న పరిస్థితులు.. అక్కడ ఉన్న వ్యక్తులను మాత్రమే విలన్లుగా చూపించాడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. కమర్షియాలిటీ కోసం పాకులాడకుండా.. రియాలిటీలో ఉండి సినిమాను తెరకెక్కించాడు దేవా కట్టా.
సినిమాలో క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా రాసుకున్నాడు దేవా కట్ట. తాను చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా సుత్తి లేకుండా చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఈ క్రమంలో ఎక్కడా పక్కదారి పట్టలేదు దేవా కట్ట. కామెడీ, పాటలు, అనవసరమైన సన్నివేశాలు ఇలాంటివి లేకుండా కథ స్ట్రైట్ గా చెప్పాడు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ మిగిలిన సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది అర్థమయ్యేలా చెప్పాడు దేవా కట్ట. అవినీతిలో ఉన్న వ్యవస్థ మారాలంటే.. మారాల్సింది మనమే అని గట్టిగా చెప్పాడు. అది మారదు అని కూడా చివర్లో చూపించాడు. సాయి ధరమ్ తేజ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆయన తర్వాత రమ్యకృష్ణ అంత అద్భుతంగా నటించింది. ఇద్దరి మధ్య సెకండాఫ్ లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకునే సన్నివేశం సినిమాకి హైలైట్. దాంతో పాటు మరో రెండు మూడు సన్నివేశాలు కూడా సినిమాలో దేవా కట్ట తన మార్క్ చూపించాడు. ప్రీ క్లైమాక్స్‌లో జగపతి బాబు, సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా మెచ్యూర్డ్ గా ఉన్నాయి. ఓవరాల్ గా.. మారని.. మారలేని.. మార్చలేని వ్యవస్థపై దేవా కట్ట సంధించిన ప్రశ్న రిపబ్లిక్.

సాయి ధరమ్ తేజ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా కెరీర్‌లో తొలిసారి చాలా సిన్సియర్ పాత్రలో కనిపించాడు. ఈయన నటనలో మెచ్యూరిటీ కూడా చాలా ఉంది. రమ్యకృష్ణలో ఎంత గొప్ప నటి ఉందో ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. విశాఖవాణి పాత్రకు ప్రాణం పోసింది ఈమె. రమ్యకృష్ణ కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే పాత్ర. ఐశ్వర్య రాజేష్ మైరా పాత్రలో చాలా బాగా నటించింది. ఇలాంటి కారెక్టర్‌కు ఒప్పుకోవడం కూడా సాహసమే. జగపతిబాబు పాత్ర కూడా చాలా బాగుంది. క్లైమాక్స్‌లో ఆయనకు చెప్పులదండ వేసే సీన్ ఆకట్టుకుంటుంది. మిగిలిన వాళ్లు కూడా చాలా బాగా ఒదిగిపోయారు.

టెక్నికల్ టీమ్:
మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ప్రాణం. జోర్ సే పాట వినడానికి కూడా బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రిపబ్లిక్ సినిమాను చాలా చోట్ల నిలబెట్టింది ఈ బ్యాగ్రౌండ్ స్కోర్. ముఖ్యంగా రమ్యకృష్ణ వచ్చినపుడు వచ్చే ఆర్ఆర్ సూపర్. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త వీక్ అనిపిస్తుంది. కథలోకి వెళ్లడానికి కాస్త టైమ్ తీసుకున్నాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. దర్శకుడు దేవా కట్టా చాలా రోజుల తర్వాత తనలోని అసలైన దర్శకుడికి పని చెప్పాడు. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నాడు. ప్రజాస్వామ్యంతో పాటు రాజకీయ నాయకులపై.. ప్రస్తుత రాజకీయాలపై ఆయన రాసిన మాటలు ఆకట్టుకుంటాయి. అలాగే కొన్ని ఎపిసోడ్స్ అద్భుతంగా రాసుకున్నాడు. పచ్చిగా కొన్ని నిజాలు మాట్లాడాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

చివరగా ఒక్కమాట:
రిపబ్లిక్.. కరెప్టెడ్ సొసైటీపై దేవా కట్టా సంధించిన ప్రశ్న..

మాగల్ఫ్ రేటింగ్: 3/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com