ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: ఉపరాష్ట్రపతి

- October 28, 2021 , by Maagulf
ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: ఉపరాష్ట్రపతి
పణజీ: అత్యుత్తమ పరిశోధన ఫలితాలు సాధించేందుకు ఉన్నతవిద్యలో బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందుకోసం విద్యార్థులు కొన్ని విషయాలను నిర్బంధంగా నేర్చుకునేలా ఒత్తిడి చేయడం కంటే, నచ్చిన విషయాలను ఎంచుకుని వాటిలో మరింత ప్రగతి సాధించేందుకు ప్రోత్సహించేవాతావరణాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఉన్నత విద్యలో శాస్త్ర, సాంకేతిక అంశాలతోపాటు మానవీయ శాస్త్రాలకు (హ్యుమానిటీస్) కూడా సరైన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.  
 
గోవాలోని పణజీలో సంత్ సోహిరోబనాత్ ఆంబియే ప్రభుత్వ కళాశాల భవనం నూతన ప్రాంగణాన్ని గురువారం ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ విషయాలకు ఇతర విషయాలతో సమానంగా ప్రాధాన్యత కల్పించడం వల్ల సృజనాత్మకత, పరిశోధనాత్మకత, విమర్శనాత్మకత, విశ్లేషణాత్మకతలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలవుతుందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత ప్రగతిపథంలోకి తీసుకెళ్లేందుకు ఈ నైపుణ్యాలు మన యువతకెంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.
 
ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం వాణిజ్యం, ఆర్థికం, భాష తదితర విషయాలకు ప్రయోగశాలను ఏర్పాటుచేయడం అభినందనీయమన్న ఉపరాష్ట్రపతి, ఈ రంగంలో ప్రపంచస్థాయి పరిశోధనలు జరగాలని సూచించారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని నిలబెట్టే దిశగా ‘వాణిజ్యం’ కీలకమైన అంశమని, ఈ-కామర్స్ రంగంలో గణనీయమైన మార్పులు కనబడుతున్నాయని ఈ దిశగా మరిన్ని మార్పులకు ఉన్నతవిద్యాసంస్థలు ముందడుగేయాలని ఆయన సూచించారు. ఈ రకమైన మార్పును బాల్యం నుంచే విద్యార్థుల్లో ప్రోత్సహించే దిశగా నూతన జాతీయ విద్యావిధానానికి రూపకల్పన జరిగిందన్నారు. 
 
గోవా రాష్ట్రం ఉన్నతవిద్యకు సంబంధించి సాధిస్తున్న ప్రగతిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, మరీ ముఖ్యంగా యువకులకంటే యువతులే ఎక్కువగా ఉన్నతవిద్యపై ఆసక్తి కనబరుస్తుండటాన్ని అభినందించారు. ఈ విషయంలో గోవా జాతీయ సగటుకంటే ఎక్కువగా ఉండటం, మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకమన్నారు.
 
మానవాభివృద్ధిలో ప్రకృతి పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. ఐటీ రంగంలో పురోగతి సాధించేందుకు అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలు ఎంతముఖ్యమో, ప్రకృతి పరిరక్షణలో భాగంగా సీతాకోక చిలుకలతో కూడిన ఓ ఉద్యానవాన్ని ఏర్పాటుచేయడం కూడా అంతే ప్రాధాన్యతాంశమని ఆయన సూచించారు. ఈ విషయాన్ని లోతుగా గమనిస్తే మన జీవితాల్లో ప్రకృతి అవసరాన్ని అవగతం చేసుకోవచ్చన్నారు. ప్రకృతిని ప్రేమించడంతో పాటు యువత శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. సంప్రదాయ భారతీయ ఆహారాన్ని తీసుకోవడంతో పాటు, యోగా, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో గోవాలోని సంప్రదాయ సంగీత కళాకారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. కళాకారులను ప్రత్యేకంగా స్టేజి మీదకు పిలిపించి, వారికి అభినందనలు తెలియజేశారు. 
 
ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై, ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రి పాద్ నాయక్, గోవా ఉపముఖ్యమంత్రి బాబు అసగావ్‌కర్, గోవా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరిమళ్ రాయ్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com