ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వండి:కేటీఆర్‌

- November 23, 2021 , by Maagulf
ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వండి:కేటీఆర్‌

హైదరాబాద్: కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం భేటీ అయింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కేంద్రమంత్రితో సమావేశమైంది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రం, రాష్ట్రంపై పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ విషయమై ఏదో ఒకటి తేల్చాలని కేటీఆర్‌ బృందం పీయూష్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలని కేటీఆర్‌ బృందం కేంద్రమంత్రిని కోరింది. బాయిల్డ్‌ రైస్‌ ఎంత మొత్తంలో తీసుకుంటారు? ముడి ధాన్యం ఎంత సేకరిస్తారు? అన్న విషయాల్లో్ క్లారిటీ ఇవ్వాలని పీయూష్‌ను కోరినట్లు సమాచారం. కాగా ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం ఇచ్చే స్పష్టతను బట్టే తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్‌ కేంద్రమంత్రికి స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, కవిత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా కేటీఆర్‌ బృందం అభ్యర్థనలు విన్న పీయూష్‌ గోయెల్‌ రెండ్రోజుల్లో తమ నిర్ణయం వెల్లడిస్తామని చెప్పినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com