13వ ఏ.ఎస్.ఈ.ఎం. సమ్మిట్ ప్లీనరీ సెషన్ లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

- November 25, 2021 , by Maagulf
13వ ఏ.ఎస్.ఈ.ఎం. సమ్మిట్ ప్లీనరీ సెషన్ లో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ:ఐక్యరాజ్య సమితి భద్రతామండలి సహా ఇతర కీలక అంతర్జాతీయ సంస్థలను నేటి సమకాలీన వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, నేటి అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్ లో ఎదురు కాబోయే సవాళ్ళను ఎదుర్కొనేందుకు తగిన విధంగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. 

13వ ఏ.ఎస్.ఈ.ఎం. సమ్మిట్ తొలి ప్లీనరీ సెషన్ ను ఈరోజు న్యూఢిల్లీ నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారభించి, ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచం నేడు మరింత వేగాన్ని సంతరించుకుని ముందుకు సాగుతోందని, ఈ నేపథ్యంలో అనేక ఆర్థిక, సాంకేతిక, భద్రతా సవాళ్ళను ఎదుర్కొంటోందన్న ఆయన, ప్రస్తుత బహుపాక్షిక వ్యవస్థ దీనికి సమర్ధవంతమైన పరిష్కారాన్ని అందించలేకపోతోందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారతదేశం సంస్కరణాత్మక బహుపాక్షిక సూత్రాలను అనుసరిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. 

“భాగస్వామ్య వృద్ధి కోసం బహుళపాక్షికవాదాన్ని బలోపేతం చేయడం” అనే అంశం మీద అంతర్జాల వేదిక ద్వారా ఆతిథ్యమిస్తూ కంబోడియా నిర్వహిస్తున్న ఏ.ఎస్.ఈ.ఎం – 13 సమ్మిట్ ఈ రోజు ప్రారంభమైంది. ఇందులో భారత ప్రతినిధి బృందానికి గౌరవ ఉపరాష్ట్రపతి నేతృత్వం వహిస్తున్నారు. శుక్రవారం జరగనున్న సమ్మిట్ రీట్రీట్ సెషన్ లోనూ ఆయన ప్రసంగించనున్నారు.

శాంతి లేని చోట అభివృద్ధి సాధ్యం కాదన్న ఉపరాష్ట్రపతి, అభివృద్ధి ముందుకు సాగని చోట ఆర్థిక పురోగతి క్షీణించి హింస, అస్థిరత లాంటివి చోటు చేసుకుంటాయని నొక్కి చెప్పారు. అందుకే ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, జీవనోపాధిని, భద్రతను పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ప్రతికూలంగా ప్రభావితమైన దేశాల పునరుద్ధరణలో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచ స్థాయిలో నిరంతర అభద్రతకు గల కారణాలను విశ్లేషించుకుని, వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన ఉపరాష్ట్రపతి, ప్రపంచ శాంతి, భద్రతలను కాపాడే దిశగా అంతర్జాతీయ వ్యవస్థ నిర్మాణంలో సంస్కరణల అవసరాన్ని ఎత్తిచూపారు.

ఒకప్పటి సవాళ్ళను ఎదుర్కోనేందుకు రూపొందించిన పాత వ్యవస్థలకు కాలం చెల్లిందన్న ఉపరాష్ట్రపతి, వేగంగా ముందుకు సాగుతున్న ప్రస్తుతం ప్రపంచంలో ఎదురౌతున్న, భవిష్యత్ లో ఎదురు కాబోయే అనేక సవాళ్లను వీటి ద్వారా పరిష్కరించలేమని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి,  అంతర్జాతీయ సహకారం విషయంలో పునరాలోచించుకోవలసిన అవసరాన్ని, దీన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచం సరైన విధంగా స్పందించకపోతే, ఇవాళ బహుపాక్షిక వ్యవస్థలో ఉన్న సవాళ్ళను ఎదుర్కోలేమని అభిప్రాయపడ్డారు.

కోవిడ్ సవాళ్ల నేపథ్యంలోనూ ప్రపంచంలో బహుపాక్షిక సంబంధాల్లో ఉన్న లోపాలను వ్యాక్సిన్ పంపిణీ బహిర్గతం చేసిందన్న ఆయన, ప్రపంచమంతా ఒకే తాటిమీద నిలబడి బహుపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కోవిడ్ నొక్కిచెప్పిందన్నారు. మహమ్మారి అనంతరం ప్రపంచం అవసరాలు భిన్నంగా పెరిగాయన్న ఆయన, అంతర్జాతీయ సహకారం కోసం స్థిరమైన -విశ్వసనీయమైన సరఫరా గొలుసులు, ఆరోగ్య భద్రత, అభివృద్ధికి పచ్చదనం - సాంకేతిక దన్ను, సుస్థిరాభివృద్ధి అనే  నాలుగు ముఖ్యమైన రంగాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. 

1996లో ఏర్పాటైన ఏ.ఎస్.ఈ.ఎం... 25వ వార్షికోత్సవం సందర్భంగా పాల్గొన సభ్యులందరికీ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళను పరిష్కరించేందుకు రెండు ఖండాల నాయకులను, ప్రజలను ఏకతాటి మీదకు తీసుకువచ్చేందుకు ఏ.ఎస్.ఈ.ఎం. చేసిన ఫలవంతమైన ప్రయత్నాలను అభినందించిన ఆయన, సహకార బహుపాక్షిక శక్తులను బలోపేతం చేసే దిశగా భారతదేశ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com