ప్రపంచ వ్యవస్థలోని అసమానతలను కోవిడ్ మహమ్మారి బహిర్గతం చేసింది: ఉపరాష్ట్రపతి

- November 26, 2021 , by Maagulf
ప్రపంచ వ్యవస్థలోని అసమానతలను కోవిడ్ మహమ్మారి బహిర్గతం చేసింది: ఉపరాష్ట్రపతి
న్యూఢిల్లీ: కోవిడ్ -19 మహమ్మారి ప్రస్తుతం ప్రపంచ వ్యవస్థలోని అనేక అసమానతలను, ప్రత్యేకించి ఆరోగ్య వ్యవస్థ సరఫరా గొలుసులో ఉన్న అంతరాలను బయటకు తీసుకొచ్చిందని, ఈ అంతరాలను పరిష్కరించేందుకు బహుపాక్షిక సహకార విధానం అవసరమని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
13వ ఆసియా – యూరప్ (ఏఎస్ఈఎం) శిఖరాగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి, కోవిడ్ నేపథ్యంలో అధునాతన మరియు అందుబాటులో ఉండే సాంకేతికలను భాగస్వామ్యం చేయడం ద్వారా అర్థవంతమైన, బహుళ వాటాదారుల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే భారతదేశ విధానం అని నొక్కి చెప్పారు. టీకా మరియు ఔషధ ఉత్పత్తిలో మరియు ఆరోగ్య సమాచారంలో పారదర్శకతకు భరోసా ఇవ్వడం ద్వారా కోవిడ్ -19 వ్యతిరేక పోరాటంలో భారతదేశ సహకారాన్ని మరింత పెంచడం ద్వారా, ప్రపంచ జనాభాలో ఆరవ వంతు మందికి మహమ్మారి సోకినప్పటికీ, ప్రపంచాన్ని సురక్షితంగా తయారు చేయడంలో భారతదేశం దోహదపడిందని తెలిపారు. 
 
100 కోట్లకు మించి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరిన భారతదేశం పూర్తి చేసిన మైలురాళ్లను ప్రస్తావిస్తూ.. సమాజమంతా ప్రభుత్వంతో కలిసిన నడవడం ద్వారానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రస్తావించినట్లుగా భారతదేశం కుడా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతులను పునఃప్రారంభించే పనిలో ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు. 
ప్రపంచీకరణ నేపథ్యంలో సముద్రతీర భద్రత ప్రాధాన్యత గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ‘సముద్రాలు ప్రపంచ శ్రేయస్సుకు మార్గాలు’ అని తెలిపారు. సంప్రదాయ మరియు సంప్రదాయేతర మార్గాల్లో వాటి ప్రాప్యత సులభంగా, అందరికీ అందుబాటులో ఉండడం చాలా ముఖ్యమని తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ ప్రాధాన్యతల్లో సముద్రతీర భద్రత ఒకటి అని తెలియజేసిన ఆయన, ఈ ఏడాది ఆగస్టులో ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బహిరంగా ఉన్నత చర్చను ప్రస్తావించారు. 
 
ఈ సందర్భంగా భారతదేశ విధానాన్ని తెలియజేసే... బహిరంగ, సురక్షిత సముద్ర వాణిజ్యం, అంతర్జాతీయ చట్టాల ఆధారంగా సముద్ర వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రకృతి వైపరీత్యాలు, సముద్రపు ప్రమాదాలను పసిగట్టేందుకు పరస్పర సమన్వయ వ్యవస్థ, సముద్ర పర్యావరణం, సముద్ర వనరుల పరిరక్షణ, దేశాల స్థిరత్వం, శోషణ సామర్థ్యం ఆధారంగా బాధ్యతాయుతమైన సముద్ర అనుసంధానాన్ని ప్రోత్సహించడం అనే ఐదు సూత్రాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ సూత్రాలు ఆసియా– యూరప్ భాగస్వామ్యం సందర్భంలోనూ సమాన ఔచిత్యాన్ని కలిగి ఉంటాయని తెలిపారు. 
 
పర్యావరణ పరిరక్షణను సైతం ప్రాధాన్యత కలిగిన మరో అంశంగా ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, వాతావరణ మార్పులపై పోరాటం సాగించేందుకు వాతావరణ న్యాయం ద్వారా వివిధ దేశాలు దీర్ఘకాలిక చొరవను తీసుకోవలసి ఉంటుందని సూచించారు. సీఓపీ-26లో సాహసోపేతమైన, ప్రతిష్టాత్మక ప్రకటనల ద్వారా భారతదేశం.. పర్యావరణం, వాతావరణ మార్పుల పట్ల తన ప్రతిస్పందనను తెలియజేడం ద్వారా అభివృద్ధికి ఓ మార్గాన్ని నిర్దేశించిందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ‘గ్రీన్ గ్రిడ్స్ ఇన్షియేటివ్’లో భాగంగా ‘ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్’ లాంటి అనేక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వీటి వల్ల కర్బన ఉద్గారాలను, ఇంధన వ్యయాన్ని తగ్గించడమే కాకుండా ఆసియా–యూరప్ భాగస్వాములతో సహా వివిధ ప్రాంతాలు మరియు దేశాల మధ్య సహకారం విషయంలో సరికొత్త మార్గాలను తెరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కోవిడ్ అనంతర పరిస్థితుల్లో మన కోసం వేరే ప్రపంచం ఎదురు చూస్తోందన్న ఉపరాష్ట్రపతి, ఇది విశ్వాసం, పారదర్శకత, వంటి అంశాల మీద ఆధారపడి ముందుకు సాగాల్సిన తరుణమన్నారు. ఆసియా, యూరప్ దేశాలను ఒకే చోటకు చేర్చే ఏఎస్ఈఎం శిఖరాగ్ర సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ విషయంలో అందరి భద్రత, అభివృద్ధి కోసం సంఘీభావ స్ఫూర్తితో తన అనుభవాన్ని, వనరులను ప్రపంచంతో పంచుకోవడానికి భారతదేశ నిబద్ధతను సైతం ఆయన పునరుద్ఘాటించారు. 
 
అంతర్జాల వేదిక ద్వారా నవంబర్ 25న ప్రారంభమైన 13వ ఆసియా–యూరప్ శిఖరాగ్ర సదస్సు శుక్రవారంతో ముగిసింది. భాగస్వామ్య వృద్ధి కోసం బహుళపక్ష వాదాన్ని బలోపేతం చేయడం అనే అంశం మీద సాగిన ఈ సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి ఉపరాష్ట్రపతి నేతృత్వం వహించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com