ఇండియా-రష్యా మధ్య కీలక ఒప్పందాలు...

- December 06, 2021 , by Maagulf
ఇండియా-రష్యా మధ్య కీలక ఒప్పందాలు...

న్యూ ఢిల్లీ: రష్యా అధినేత పుతిన్ భారత పర్యటనలో కీలక ఒప్పందాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ప్రధాని మోదీ-పుతిన్ కీలక ఒప్పందాలపై చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్య, ఇంధనం, పెట్టుబడులు, టెక్నాలజీ రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. నౌకాయానం, అనుసంధాన రంగాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న S-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ డెలివరీపై మోదీ-పుతిన్ మధ్య చర్చలు జరిగాయి. కాగా గడిచిన మూడు దశాబ్దాలుగా భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ ఘనత ప్రధానంగా పుతిన్‌కే చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

కరోనా సంక్షోభ సమయంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురైనా భారత్-రష్యా సంబంధాల్లో ఎటువంటి మార్పులు రాలేదని మోదీ అన్నారు. వ్యాక్సిన్ సహా ఇతర విషయాల్లో ఇరుదేశాలు పూర్తిగా సహకరించుకున్నాయని తెలిపారు. ఆర్థిక రంగంలో ఇరుదేశాల సహకారాన్ని గుర్తుచేసిన మోదీ… భాగస్వామ్య లక్ష్యాలను సాధించడంలో వ్యాపారవేత్తలు కూడా ప్రోత్సాహం అందించాలని సూచించారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ.. తాము భారతదేశాన్ని గొప్ప శక్తిగా, స్నేహపూర్వక దేశంగా, కాల పరీక్షకు తట్టుకున్న మిత్రదేశంగా భావిస్తున్నామని తెలిపారు. ఇరుదేశా దేశాల మధ్య మరిన్ని సంబంధాలు పెరుగుతున్నాయన్నారు. భవిష్యత్తుపై తాను ఎంతో ఆశాజనకంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com