మహానటి జయంతి ఉత్సవాలు ప్రారంభం

- December 06, 2021 , by Maagulf
మహానటి జయంతి ఉత్సవాలు ప్రారంభం

వంశీ ఇంటర్నేషనల్ ఇండియా, శుభోదయం గ్రూప్ ఇండియా  సంయుక్త ఆధ్వర్యంలో మహానటి సావిత్రి 86వ జయంతి కార్యక్రమాలు ఈరోజు, డిసెంబర్ 6న ప్రారంభమయ్యాయి. 

శుభోదయం గ్రూప్ ద్వారా అంతర్జాలంలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో ఐదు ఖండాలలోని తొమ్మిది దేశాలనుండి 80 మంది రచయితలు, రచయిత్రులు పాల్గొని మహానటి సావిత్రి నటించిన 80 చిత్రాలపై “సావిత్రి నటనా వైదుష్యం” అనే అంశం మీద ఈ వారం రోజులలో ప్రసంగిస్తారు.  

ఈ కార్యక్రమానికి వంశీ వ్యవస్థాపక అధ్యక్షులు, కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు రామరాజు గారు స్వాగత వచనాలు పలకగా, రచయిత్రి, కవిత బేతి వ్యాఖ్యాతగా ఎంతో ఉత్సాహంగా వ్యవహరించారు. 

శ్రీలక్ష్మీ అవధానం ప్రార్థనా గీతం ఆలపించి,లక్ష్మీ శ్రీనివాస్ రామరాజు, సావిత్రి నటించిన చిత్రం ‘డాక్టర్ చక్రవర్తి’ సినిమా నుంచి ‘నీవు లేక వీణ పలుక లేనన్నది’ అనే పాటను వీణపై వాయించడంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 

మహానటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి జ్యోతి ప్రకాశం చేసి  తమ తల్లి అయిన సావిత్రిని గుర్తుచేసుకుంటూ "సావిత్రి ఎంతో చిలిపితనంగా చలాకీగా ఉండేవారు, మాయాబజార్ సినిమా షూటింగ్ సమయంలో నేను జన్మించాను,ఈ కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది,అమ్మ పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది” అని కొన్ని విషయాలు పంచుకున్నారు.  

వారి భర్త రావు మాట్లాడుతూ పి.వి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి చెన్నై వెళ్లగా ఫిలిం ఫ్రాటెర్నిటీ నుండి M.G.R, సావిత్రి తదితర ప్రముఖులు ఎందరో పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఆయనకు సన్మానం చేసి పెద్ద పూలదండ  వేసి, ఆ దండను వేలం వేశారు. M.G.R కి ఎదురు నిలిచే సాహసం ఎవరు చేయరు.అయితే సావిత్రి ఆయనకి ధీటుగా నిలబడి ‘ఏమైనా సరే ఈ దండ నేను కొనాల్సిందే’ అని పట్టుబట్టి కొన్ని వేల రూపాయలు వెచ్చించి వేలంపాటలో ఆ దండ కొన్నారు” అని చెప్పారు.   

ఆ తర్వాత ముఖ్య అతిధి, ఎమ్మెల్సీ మరియు మాజీ భారత ప్రధానమంత్రి పి.వి నరసింహ రావు కుమార్తె సురభి వాణీ దేవి తమ ప్రసంగాన్ని వినిపిస్తూ “సావిత్రి ని నేను ఎంతో అభిమానించేదాన్ని, ఆ రోజుల్లో ఆవిడ సినిమా మొట్టమొదటి ఆట చూడడం, ఆవిడలాగే చీరలు ధరించడం మాకు ఒక పోటీ గా ఉండేది” అని అన్నారు.

శైలజా సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ, వంశీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రసన్న లక్ష్మి వందన సమర్పణ చేశారు.చైర్మన్ శుభోదయం గ్రూప్ లయన్ డా.కలపటపు లక్ష్మి ప్రసాద్ ఈ కార్యక్రమానికి తమ సహకారం అందించారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

మొదటి రోజున సావిత్రి ఈ పది సినిమాల గురించి పదిమంది రచయిత్రులు “సావిత్రి నటనా వైదుష్యం” పై తన ప్రసంగాలను వినిపించారు.

1) దేవదాసు - డా.కె వి కృష్ణ కుమారి    
2) మాంగల్యబలం - డా.సుధా దేవి  
3) మూగమనసులు -  షామీర్ జానకి దేవి 
4) మాయాబజార్ - డా.తిరునగరి దేవకి 
5) రక్తసంబంధం -  కుసుమ ఉప్పలపాటి
6) సిరిసంపదలు - వైజయంతి పురాణపండ
7) దొంగరాముడు - ఉమా దేవి కల్వకోట 
8) పూజా ఫలం - నెల్లుట్ల రమాదేవి
9) సుమంగళి - డా.అమృత లత
10) తోటికోడళ్ళు  - అత్తలూరి విజయలక్ష్మి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com