బ్యాంకు ఖాతాదారులకు మరో షాక్

- December 07, 2021 , by Maagulf
బ్యాంకు ఖాతాదారులకు మరో షాక్

ముంబై: బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) బ్యాడ్ న్యూస్ అందించింది. కొత్త సంవత్సరం నుంచి ఏటీఎం లావాదేవీలపై అదనపు ఛార్జీలు భారం మరింతగా పెరగనుంది. ప్రతీ నెలా ఖాతాదారులకు పరిమితిలో ఉచిత ఏటీఎం లావాదేవీలను చేసుకునే సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే రూ. 20 అదనపు ఛార్జీను వసూలు చేస్తూ వస్తున్నాయి. అయితే 2022 జనవరి 1వ తేదీ నుంచి ఈ ఛార్జీ పెరగనుంది. తాజాగా ఉచిత ఏటీఎం లావాదేవీల కంటే మించి చేసే నగదు, నగదేతర ట్రాన్సాక్షన్స్‌పై అదనపు ఛార్జీలను పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతించింది.

కొత్త ఏటీఎంల ఏర్పాటు, వాటి నిర్వహణ వ్యయం, ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెరగడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. దీనితో 2022 జనవరి 1వ తేదీ నుంచి సామాన్యులకు అదనపు ఛార్జీలు పెను భారంగా మారనున్నాయి. ఇకపై ఉచిత ఏటీఎం లావాదేవీలు దాటిన ప్రతీదానికి రూ. 21+ జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదిఏమైనా మెట్రో నగరాల్లో 8 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరేశాఖ) లావాదేవీలను.. అలాగే నాన్-మెట్రో నగరాల్లో 10 ఉచిత ఏటీఎం(5 హోం బ్రాంచ్, 3 వేరే బ్యాంకుల ఏటీఎంల) లావాదేవీలను కొనసాగించనున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది..
2022 జనవరి 1వ తేదీ నుంచి తమ ఏటీఎంలలో ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటితే.. రూ. 21 + జీఎస్టీ పడుతుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆర్థికేతర లావాదేవీలు (బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్పు) ఉచితంగానే చేసుకోవచ్చునని పేర్కొంది. అయితే వేరే బ్యాంకుల ఏటీఎంలలో ఆర్ధిక, అర్దికేతర లావాదేవీలకు రూ. 21 + జీఎస్టీ చెల్లించాలని స్పష్టం చేసింది.

“2022 జనవరి 1వ తేదీ నుంచి కొత్త ఏటీఎం అదనపు ఛార్జీలు అమలులోకి వస్తాయి. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని దాటితే.. రూ. 21 + జీఎస్టీ చెల్లించాలి” అని యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com