బంగ్లాదేశ్ పై భారత్ విజయం

- March 23, 2016 , by Maagulf
బంగ్లాదేశ్ పై భారత్ విజయం

చివరిబంతి వరకు తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై భారత్ అత్యద్భుత విజయాన్ని సాధించింది. హోరాహోరీగా మహాయుద్ధంలా జరిగిన మ్యాచ్ లో ఊహించిన మలుపుల మధ్య ధోనీసేన చిరస్మరణీయ విజయాన్ని సాధించింది. చివరిబంతి వరకు ఇరుజట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించిన ఈ మ్యాచ్‌లో విజయలక్ష్మి మాత్రం భారత్‌ వైపు నిలిచింది.


భారత్ విసిరిన 147 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ చివరి ఓవర్ చివరి బంతివరకు పోరాడి.. ఒక్క పరుగు దూరంలో ఆగిపోయింది. ఉద్వేగభరితంగా ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్‌ కేవలం ఒక పరుగు తేడాతో మిరాకిల్ విక్టరీని సొంతం చేసుకుంది. మొదటినుంచి ధాటిగా ఆడుతూ లక్ష్యం దిశగా దూసుకొచ్చిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది.


హార్థిక్ పాండ్యా విసిరిన చివరి ఓవర్ ఓ అద్భుతం. ఓ మిరాకిల్‌. లాస్ట్ ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 11 పరుగులు చేయాల్సి ఉంది. మొదటి బంతికి మహమ్మదుల్లా 1 పరుగు తీశాడు. ఆ వెంటనే రెండో బంతికి ముష్ఫికర్‌ ఓ ఫోర్ కొట్టాడు. ఇక బంగ్లా గెలుపు లాంఛనమేనని అంతా అనుకున్నారు. మైదానం నిండా నిశ్శబ్దం.  మళ్లీ పాండ్యా బంతిని ఎదుర్కొన్న ముష్ఫికర్‌ మరో ఫోర్‌తో జట్టును గెలుపునకు చేరువగా తీసుకొచ్చాడు. అయితే నాలుగో బంతికి పాండ్యా అద్భుతం చేశాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన ముష్ఫికర్ డీప్ మిడ్‌వికెట్‌లో ధావన్‌కు దొరికిపోయాడు. బంగ్లా ఏడో వికెట్ కోల్పోయింది. రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాలి. గెలుపు ఇరు జట్ల మధ్య ఊగిసలాడుతుండగా ఈ రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టడంతో భారత్‌కు ఊహించని విజయం, ఉద్వేగభరితమైన విజయం లభించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం అభిమానుల ఆనందోత్సాహాలతో హోరెత్తింది.  

సెమిస్‌ బరిలో ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో భారత్ బౌలర్లు బంగ్లాదేశ్‌ను 145 పరుగులకు కట్టడి చేశారు. 147 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. అశ్విన్ బౌలింగ్‌లో మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మహమ్మద్ మిథున్ అలీ అశ్విన్‌ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అశ్విన్ బౌలింగ్‌లోనే  తమిమ్ ఇక్బాల్‌ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను బుమ్రా మిస్‌ చేశాడు. ఇంత సులభమైన క్యాచ్‌ను బుమ్రా విడువడం  అభిమానులను, ధోనీసేనను షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాత తమిమ్‌, షబ్బీర్ రహ్మాన్‌ ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. 35 పరుగులు చేసిన తమిమ్ ఇక్బాల్‌ను జడ్డేజా బౌలింగ్‌లో ధోనీ స్టంపౌట్‌ చేశాడు. ధాటిగా ఆడుతున్న షబ్బీర్ రహ్మాన్‌ కూడా ధోనీ ఉచ్చులో చిక్కాడు. రైనా బౌలింగ్‌లో రహ్మాన్‌ను చాలా తెలివిగా ధోనీ స్టంపౌట్‌ చేశాడు. షబ్బీర్ 15 బంతుల్లో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. 6 పరుగులు చేసిన మొర్తాజా జడ్డేజా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌ అవ్వగా, 22 పరుగులు చేసిన షకిబుల్‌ హసన్‌ అశ్విన్ బౌలింగ్‌లో రైనాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు.

ఓవైపు వికెట్లు పడుతున్నా.. మరోవైపు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌లో మాత్రం జోరు తగ్గలేదు. అయితే చివరి ఓవర్ లో  వరుసగా వికెట్లు పడటం బంగ్లాదేశ్ కొంపముంచిందనే చెప్పాలి. చివరివరకు భారత బౌలర్లు సడలని ఉత్సాహంతో పోరాటపటిమ చూపారు.  బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో టాస్ ఓడి ధోనీ సేన మొదట బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 146 పరుగులే చేసింది. బంగ్లాదేశ్ ముందు 147 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com