దుబాయ్ రియల్ ఎస్టేట్‌కు ఎక్స్‌పో ఊతం..

- December 11, 2021 , by Maagulf
దుబాయ్ రియల్ ఎస్టేట్‌కు ఎక్స్‌పో ఊతం..

దుబాయ్: యూఏఈ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దుబాయ్ ఎక్స్‌పో 2020 ఆ దేశ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి ఊతమిచ్చింది. దీంతో ఎక్స్‌పో జరుగుతున్న చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు దుబాయ్ వ్యాప్తంగా ఒక్కసారిగా రియల్ రంగం పుంజుకుంది.ఇప్పటికే దుబాయ్‌లో సొంత ప్రాపర్టీ కోసం ఎక్కడలేని డిమాండ్ ఉంది. దీనికి ఇప్పుడు ఎక్స్‌పో మరింత తోడైంది. కరోనా కారణంగా కాస్తా డీలా పడ్డ రియల్ ఎస్టేట్.. ఎక్స్‌పో పుణ్యమా అని ఒక్కసారిగా పరుగులు పెడుతోంది.ఈ నేపథ్యంలోనే ప్రాపర్టీ ధరలు అమాంతం పెరిగిపోయాయి.అక్కడి రియల్ ఎస్టేట్ కన్సల్టేన్సీలు చెబుతున్న దాని ప్రకారం దుబాయ్‌ రియల్ రంగం మొదటి త్రైసిమాసికంలో 9శాతం పెరుగుదలను నమోదు చేయగా..అదే ఏడాది చివరికి వచ్చేసరికి అది 37 శాతానికి చేరింది. 

మునుముందు ఇది మరింత పెరిగే అవకాశం ఉండడంతో చాలా మంది ఇప్పుడే సొంత ఇంటి కలను నేరవేర్చుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా చాలా ఏళ్లుగా దుబాయ్‌లో ఉంటున్న ప్రవాసులు సొంతింటి కోసం పరుగులు పెడుతున్నారు.దీంతో విల్లాలకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టేన్సీలు చెబుతున్నాయి.అందులోనూ అన్ని వసతులతో ఉన్న ఇళ్లకు మంచి గిరాకీ ఉందట.ఇక దుబాయ్‌లో ఇంటి అద్దెలు కూడా భారీగా ఉండడం వలసదారులను సొంతింటి కొనుగోలు వైపు నడిపిస్తున్న మరో కారణం. ఇలా పలు కారణాలతో ప్రస్తుతం ప్రవాసులు భారీగా సొంత నివాసాల కోసం వెతికే పనిలో పడ్డారు. ఇదే కోవలో భారత్‌కు చెందిన అనురాగ్ చతుర్వేది కూడా తాజాగా అక్కడ సొంతింటిని కొనుగోలు చేశారు.అయితే, ఆయన అక్కడ ఎందుకు ప్రాపర్టీ కొనుగోలు చేశారు? కొనే ముందే ఆయన తీసుకున్న జాగ్రత్తలేంటి? దబాయ్ ఎక్స్‌పో ప్రభావం రియల్ రంగంపై ఏ మేరకు ఉంది? తదితర విషయాల గురించి అనురాగ్ వివరించారు...

అనురాగ్ మాట్లాడుతూ.. "యూఏఈ నివసించడానికి అత్యంత సురక్షితమైన దేశం అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాను. కొనుగోలు చేయడానికి ఏడాది ముందు నుంచి మంచి ప్రాపర్టీ కోసం వెతికాను. ఆ సమయంలో పరిసర ప్రాంతాలు, వాస్తు, ప్రాంతం అభివృద్ధి, రవాణా, నగరానికి ప్రాప్యత తదితర విషయాలను పరిగణలోకి తీసుకున్నాను. దాంతో చివరకు నా ఆలోచనలకు అనుగుణంగా ఉన్న ఇల్లు ఫుర్జన్‌ ప్రాంతంలో దొరికింది. దాన్నే కొనుగోలు చేసాను. అంతేగాక ఇది ఎక్స్‌పో, షేక్ జాయెద్ రోడ్, ఇతర ప్రధాన ఆకర్షణల మధ్యలో ఉంది. ఇంకో అంశం ఏమిటంటే సొంతింటి కోసం చూస్తున్నప్పుడు మన ఆర్థిక స్థితిగతులను చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీ సెల్ఫ్ ఫండింగ్‌ ద్వారా కొనుగోలు చేసే ఆస్తి విలువలో కనీసం 60 శాతం చెల్లించగలగాలి. అప్పుడే తర్వాతి వాయిదాల చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదు" అని చెప్పుకొచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com