పరిపాలనా భాషగా భారతీయ భాషలే ఉండాలి – ఉపరాష్ట్రపతి
- December 12, 2021
హైదరాబాద్: దేశంలో పరిపాలనా భాషలుగా మాతృభాషలే ఉండాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.పరాయి పాలకులు మన భాష సంస్కృతుల పట్ల ఓ ప్రతికూల భావాన్ని, ఆత్మన్యూనతను మన మనసుల్లో నాటే ప్రయత్నం చేశారన్న ఉపరాష్ట్రపతి, కొందరు నేటికీ వాటిని గుడ్డిగా అనుసరించడం బాధాకరమన్నారు. ఈ ఆత్మన్యూనతను వదిలించుకుని భాష సంస్కృతుల గొప్పతనాన్ని ఘనంగా చాటుకోవాలని దిశానిర్దేశం చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విద్యార్థులు అర్ధం చేసుకుని భవిష్యత్తులో వాటిని అనుసరించేలా అర్థవంతమైన జీవితాన్ని అందించడం విద్యాలక్ష్యాల్లో ఒకటన్న ఆయన, విద్య ద్వారా విద్వత్తు, వినయంతో పాటు భవిష్యత్ జీవనానికి అవసరమైన మార్గదర్శనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఏ సంప్రదాయమైనా ఓ తరం నుంచి మరో తరానికి వారసత్వంగా అందుతుందన్న ఉపరాష్ట్రపతి, మన వారసత్వాన్ని కాపాడి, ముందు తరాల్లో జవసత్వాలను నింపే మహోన్నతమైన ఆచార వ్యవహారాల సమాహారమే సంస్కృతి అని పేర్కొన్నారు.
ఆదివారం, నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాయల వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పడటంతోపాటు, దేశవ్యాప్తంగా భాషాప్రాతిపదికన ఏర్పాటైన రెండో విశ్వవిద్యాలయం కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి తంగెడ కిషన్ రావు కి, రిజిస్ట్రార్ భట్టు రమేష్ కి, ఇతర బోధన, బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు భాషాబోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ సేవ వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకుంటున్న విశ్వవిద్యాలయ సంకల్పాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించేందుకు చొరవ తీసుకున్న నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ని స్మరించుకుని వారి స్మృతికి నివాళులు అర్పించారు.
‘అసలు విద్యకు, భాషా సంస్కృతులు, కళలకు సంబంధమేంటనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. దేశ నైసర్గిక స్వరూపంలో ఉన్న వైవిధ్యం కారణంగా భిన్న ప్రాంతాలకు చెందిన ప్రజల ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. వాటి ప్రభావం సంస్కృతి సంప్రదాయాల మీద కూడా ఉంటుంది. అందుకే సంస్కృతిని కాపాడుకోవాలి. సంస్కృతి నిలబడాలంటే భాషను, ఆచార వ్యవహారాలను, మన కళలను పరిరక్షించుకోవాలి. కేవలం పరిరక్షించుకోవడమే కాదు, మన ముందు తరాలకు వాటిని సగర్వంగా అందజేయాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎల్లలు చెరిగిపోతున్నాయని, ఎల్లలు చెరిగినంత మాత్రాన మన గతమేంటనే విషయాన్ని ఎవ్వరూ మరువ కూడదన్న ఉపరాష్ట్రపతి, నీవెవరు అనే భవిష్యత్ తరాల ప్రశ్నకు సమాధానం ఇచ్చేది మన సంస్కృతే అని పేర్కొన్నారు. సంస్కృతిని కాపాడుకోవాలని, సంస్కృతి నిలబడాలంటే భాషను, ఆచార వ్యవహారాలను, మన కళలను పరిరక్షించుకోవాలని ఆయన అన్నారు. కేవలం సంస్కృతిని పరిరక్షించుకోవడంతోపాటు ముందు తరాలకు వాటిని సగర్వంగా అందజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తెలుగు భాషా గ్రంథాలు ఇతర భాషల్లోకి, ఇతర భాషల పుస్తకాలు తెలుగు భాషలోకి అనువాదం విస్తృతంగా జరగాల్సిన అవసరముందన్న ఉపరాష్ట్రపతి, ఈ దిశగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ సంకల్పాన్ని కొనసాగిస్తుండాన్ని అభినందించారు. శ్రీ కృష్ణదేవరాయలు రచించిన ఆముక్త మాల్యద కావ్యాన్ని తమిళంలోకి అనువదించి ముద్రించడం, దానికి సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందడం అభినందనీయన్నారు. తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మహాత్మ్యం’ కావ్యాన్ని హిందీలోకి అనువదించడం, ప్రసిద్ధ తమిళ వ్యాకరణమైన ‘తొల్కాప్సియం’ ను తెలుగులోకి అనువదించి ముద్రించడం లాంటి కార్యక్రమాలను అభినందిస్తూ.. మరింత విస్తృత స్థాయిలో అనువాదం జరిగేలా సంబంధిత విభాగాలన్నీ ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
తెలుగు ప్రాచీనమైన భాష అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్న ఉపరాష్ట్రపతి, ఆధునిక కాలానికి అనుగుణంగా తెలుగు భాషను ప్రతి ఒక్కరికీ చేరువ చేసేందుకు కృషిజరగాలన్నారు. దీంతోపాటు సాంకేతిక పదాలకు సంబంధించిన తెలుగు సమానార్ధక నిఘంటువులను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నూతన జాతీయ విద్యావిధానం మాతృభాషలకు మరింత ప్రాధాన్యత పెంచుతున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాలన్నీ చొరవ తీసుకుని, ఆయా భాషలకు సంబధించిన సాంకేతిక పదాలతో పుస్తకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు భాష మీద నూతన విధానంలో పరిశోధనలకు చొరవ తీసుకోవాలని, ముఖ్యంగా తెలుగు భాషను ముందు తరాలకు మరింత ఆసక్తికరంగా అందించేందుకు అవసరమైన విధానాల మీద దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ దిశగా సాగే పరిశోధనలకు అవకాశం కల్పించాలని సూచించారు.
తెలుగు విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కవి, విమర్శకుడు డా. కూరెళ్ళ విఠలాచార్య కి, కూచిపూడి నాట్యాచార్యులు కళాకృష్ణలకు ఉపరాష్ట్రపతి అవార్డుల ప్రదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విఠలాచార్య గారు 22 పుస్తకాలను వెలువరించడమే గాక, సుమారు రెండు లక్షల పుస్తకాలతో అందరికీ ఉపయోగపడేలా తమ సొంత ఇంటిలోనే గ్రంథాలయాన్నిఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అలాగే సత్యభామ పాత్రలో ఒదిగిపోయి నటించే కళాకృష్ణ నాట్య, అభినయ పటిమలను అభినందించారు.
విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి, తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధి కోసం చొరవ తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలియజేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధంగా భాష, సంస్కృతి, కళలను కాపాడుకునేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు.
అనంతరం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్ ప్రదర్శనను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా స్వాతంత్రోద్యమంలో దేశభక్తులు చేసిన త్యాగాలు నిరుపమానమైనవని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. వారి త్యాగాల పట్ల ప్రతి భారతీయుడు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలని ఆకాంక్షించారు. నవభారత నిర్మాణమే అందరి లక్ష్యం కావాలన్న ఆయన, అందరం కలిస్తేనే భారతదేశమని, సంఘటితమైన కదిలితేనే పురోగతి సాధ్యమౌతుందని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంశాఖామాత్యులు మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి. వినోద్ కుమార్, విశ్వవిద్యాలయ ఉపకులపతి తంగెడ కిషన్ రావు, రిజిస్ట్రార్ భట్టు రమేష్, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!