మోడీ ఫోటో పై అభ్యంతరం...కోర్టు భారీ జరిమానా

- December 21, 2021 , by Maagulf
మోడీ ఫోటో పై అభ్యంతరం...కోర్టు భారీ జరిమానా

కేరళ: కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌లపై ప్రధాని చిత్రాన్ని ఉపయోగించడం వల్ల ఉపయోగం లేదా ఔచిత్యం లేదంటూ పిటిషనర్ పీటర్ మైల్‌పరంబిల్ అక్టోబర్‌ నెలలో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు ఈ పిటిషన్‌ విచారణ సంధర్బంగా హైకోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఈ పిటిషన్ వెనుక రాజకీయ ఉద్దేశం దాగి ఉందని, ప్రజా ప్రయోజనాల కోసం కాదని కేవలం​ ప్రచారం కోసమేనని కోర్టు పేర్కొంది.

ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టీస్‌ పీవీ కున్హికృష్ణన్ మాట్లాడుతూ... "ప్రధానమంత్రిని కాంగ్రెస్ ప్రధాని అని గానీ బీజేపీ ప్రధాని అని గానీ లేదా ఏ రాజకీయ పార్టీకి ప్రధాని అని గానీ ఎవరూ చెప్పలేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఒకసారి ప్రధాని పదవికి ఎన్నికైతే ఆయనే మన దేశానికి ప్రధానమంత్రి." అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వ విధానాలపైన లేదా ప్రధాన మంత్రి రాజకీయ వైఖరిపై కూడా విభేదించవచ్చు. కానీ పౌరులకు ధైర్యాన్ని పెంపొందించే సందేశంతో ప్రధానమంత్రి ఫోటోతో కూడిన టీకా ధృవీకరణ పత్రాన్ని తీసుకువెళ్లడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అని అన్నారు.

ప్రజా తీర్పుతోనే మోదీ ప్రధాని అయ్యారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు పిటిషనర్‌కి హైకోర్టు రూ. 1 లక్ష జరిమానాను విధించింది. పైగా ఆరు వారాల్లోగా కేరళ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (కెఎల్‌ఎస్‌ఎ)కి డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, జరిమానాను సకాలంలో జమ చేయడంలో విఫలమైతే అతని ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేయాలని కోర్టు పేర్కొంది. అంతేకాదు కోర్టులో తీవ్రమైన కేసులు నమోదవుతున్నప్పుడు, అలాంటి అనవసరమైన పిటిషన్లను ప్రోత్సహించలేము అని కూడా హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com