2021లో పోలీసు శాఖ పనితీరు నివేదికను వెల్లడించిన ఏపీ డీజీపీ
- December 29, 2021
అమరావతి: నేరాల కట్టడి, దోషులకు సత్వర శిక్షలు పడేలా కేసుల సత్వర దర్యాప్తులో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరుస్తోందని డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు నమోదులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల్లో చార్జిషీట్ల దాఖలులోనూ అగ్రస్థానం సాధించిందన్నారు. ప్రభుత్వం దిశ యాప్ ద్వారా ఇచ్చిన భరోసాతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. వేధింపులకు పాల్పడుతున్న వారికి శిక్షలు విధించడం కూడా పెరిగిందని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో సత్ఫలితాలు సాధిస్తున్నామన్నారు.
2019లో పోలిస్తే రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వరకట్న వేధింపుల కేసులు, వైట్కాలర్ నేరాలు తగ్గాయని తెలిపారు. అన్ని కేటగిరీల నేరాలు కలిపి 2019తో పోలిస్తే 27 శాతం, 2020తో పోలిస్తే 18 శాతం తగ్గాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసులు విశేష సేవలు అందించారని అన్నారు. పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు రావడం రాష్ట్ర పోలీసుల పనితీరుకు నిదర్శనమని చెప్పారు. వచ్చే ఏడాది మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, విధానాలతో పోలీసు వ్యవస్థను మరింత పటిష్ట పరుస్తామన్నారు. 2021 సంవత్సరం పోలీసు శాఖ పనితీరు నివేదికను ఆయన మంగళవారం విడుదల చేశారు.
రికార్డుస్థాయిలో ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు
దోషులకు సత్వరం శిక్షలు పడేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేశాం. 2021లో ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021లో 45,440 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, వీటిలో 36 శాతం కోవిడ్ నిబంధనల అమలు వంటి అవుట్రీచ్ కార్యక్రమాలకు చెందినవే. 2018లో 83 శాతం, 2019లో 85.9 శాతం, 2020లో 89.1 శాతం చార్జ్షీట్లు నమోదు కాగా 2021లో 90.2 శాతం నమోదయ్యాయి.
- 715 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 75 అత్యాచారం కేసులు, 1,061 లైంగిక దాడుల కేసుల్లో 7 రోజుల్లోనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ూ సైబర్ బుల్లీయింగ్ కేసుల్లో 1,551 చార్జిషీట్లు నమోదు చేశాం.
- స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 40,404 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 96% సమస్యలను 7 రోజుల్లోనే పరిష్కరించాం.
75 శాతం కేసుల్లో దోషులకు శిక్షలు
2021లో రికార్డు స్థాయిలో శిక్షలు పడ్డాయి. 2017లో 49.4%, 2018లో 52.6%, 2019లో 38.4%, 2020లో 69.7% కేసుల్లో శిక్షలు పడగా... 2021లో 75.09 % కేసుల్లో దోషులకు శిక్షలు పడటం పోలీసు శాఖ సమర్థతకు నిదర్శనం.
‘దిశ’తో ఫిర్యాదు చేస్తున్న మహిళలు
దిశ యాప్ విప్లవాత్మక మార్పులు తెచ్చింది.రికార్డు స్థాయిలో 97,41,943 మంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. లైంగిక దాడుల కేసుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 60 రోజుల్లోగా ఏకంగా 92.27 శాతం చార్జిషీట్లు దాఖలయ్యాయి. జాతీయ సగటు 40 శాతం మాత్రమే. ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 34,037 మంది పిల్లలను రక్షించి వసతి గృహాలకు తరలించాం.
క్షీణించిన మావోయిస్టుల ప్రాబల్యం
2021లో రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.ఈ ఏడాది రాష్ట్రంలో నాలుగు ఎన్కౌంటర్లు జరిగాయి. ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. నలుగురు మావోయిస్టు నేతలను, 43 మంది మిలీషియా సభ్యులను అరెస్టు చేశాం. 13 మంది నేతలు, 5 మంది మిలిషియా సభ్యులు లొంగిపోయారు.
గంజాయి సాగుపై ఉక్కుపాదం
దేశంలోనే తొలిసారిగా ఆపరేషన్ పరివర్తన్ పేరుతో 7,226 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేశాం.దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.8,875.24కోట్లు. 2,762 గంజాయి కేసులు నమోదు చేశాం.1,694 వాహనాలను జప్తు చేసి రూ.314.50 కోట్ల విలువైన 3,13,514 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాం. అక్రమ మద్యం, సారా ముఠాలపై 43,293 కేసులు నమోదు చేశాం.
జాతీయ స్థాయిలో అవార్డులు
- స్మార్ట్ పోలీసింగ్పై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ చేసిన సర్వేలో ఏపీ పోలీసు శాఖ మొదటిస్థానం సాధించింది.
- కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు దాదాపు 150 జాతీయ అవార్డులను పోలీసు శాఖకు ప్రకటించాయి.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు