రివ్యూ: అతిథి దేవో భవ

- January 07, 2022 , by Maagulf
రివ్యూ: అతిథి దేవో భవ

టైటిల్‌ : అతిథి దేవోభవ
నటీ,నటులు: ఆది సాయికుమార్‌, నువేక్ష, రోహిణి, సప్తగిరి తదితరులు
నిర్మాతలు: రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల 
దర్శకత్వం : పొలిమేర నాగేశ్వ‌ర్‌ 
సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌
సినిమాటోగ్రఫీ: అమ‌ర్‌నాథ్ బొమ్మిరెడ్డి
విడుదల తేది:  జనవరి 7, 2022

అభయ్ రామ్ (ఆది సాయికుమార్)కు చిన్నప్పటి నుండి మోనో ఫోబియా. ఒక్కడే ఉండటం అంటే అతనికి మరణంతో సమానం. అలాంటి వ్యక్తి వైష్ణవి (నువేక్ష) ప్రేమలో పడతాడు. పెళ్ళికి దారి తీసిన ఈ ప్రేమ ప్రయాణంలో తనలోని లోపాన్ని అతను వైష్ణవి చెప్పాడా? ఆమె దాన్ని అంగీకరించిందా? మోనో ఫోబియా కారణంగా అభి జీవితంలో ఎలాంటి దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయ్? అన్నదే ఈ సినిమా.

నిజానికి ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా ఉంటుంది. మోనో ఫోబియాను మించిన భయాలకు లోనయ్యే వాళ్ళే ఈ సమాజంలో అధికం. అయితే ఓ చిన్న సమస్యను బూతద్దంలో చూపించాడు దర్శకుడు నాగేశ్వర్. దీన్ని అధిగమించే ప్రయత్నం మీద ఫోకస్ పెట్టకుండా, ఆ చిన్న లోపం కారణంగా హీరో సైకోలా ప్రవర్తించినట్టు చూపడంతో కథ గాడి తప్పింది. అసలు కథను ద్వితీయార్థంలో చూపడంతో ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్టు అయ్యింది. ఎవరో ఒకరి తోడు కోరుకునే హీరో పాలవాడితో, పని అమ్మాయితో ప్రవర్తించే తీరు చికాకు పెట్టిస్తుంది. యేళ్ళ తరబడి స్నేహం చేసే స్నేహితుడికి కూడా అభి లోని లోపం తెలియదంటే నమ్మబుద్ధి కాదు. ఇక హీరో తనలోని లోపాన్ని ప్రేమించిన అమ్మాయికి తెలియచేయలేక సతమతమౌతూ, కాలయాపన చేయడం, చివరకు ఏదో రూపంలో అది అవతలి వారికి తెలిసిపోయి, మోసగాడనే ముద్ర వేయడమనేది చాలా కామన్ పాయింట్. అయితే ఇందులో ఆ లోపం కాస్తంత కొత్తగా ఉంది. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా చూపించినా బాగానే ఉండేది. కానీ అవసరమైన యాక్షన్ ను మిక్స్ చేసి రసాభస చేశారు. పోలీస్ స్టేషన్ లో చిత్రీకరించిన భారీ ఫైట్ కూడా అలాంటిదే.

కథాగమనంలో ప్రేక్షకుల మదిలో మెదిలే ప్రశ్నలు కోకొల్లలు. తాము రాసుకున్న కథను సన్నివేశాలుగా మలిచి, మూవీ తీశారు తప్పితే, ఎక్కడా లాజిక్కుల జోలికి పోలేదు. పైగా ఇందులో ప్రతినాయకుడు… హీరో లోపలే దాగి ఉన్నాడు తప్పితే, బయట ప్రత్యేకంగా ఎవరూ లేదు. అది పెద్ద మైనస్. ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్ లో హీరో తన సమస్యను అధిగమించినట్టు చూపించి ఉంటే… ప్రేక్షకులకు కాస్తంత సంతృప్తి కలిగి ఉండేది. కానీ డైరెక్టర్ అలాంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. అందువల్ల సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ ఎలాంటి ఉత్కంఠ లేకుండా సాదాసీదాగా సాగిపోయింది.

ఆది సాయికుమార్ క్యారెక్టరైజేషన్ లో షేడ్స్ చాలానే ఉన్నాయి. వాటికి తగ్గ హావభావాలు ప్రదర్శించడానికి ప్రయత్నమైతే చేశాడు, కానీ పెద్దంత సక్సెస్ కాలేదు. కొత్తమ్మాయి నువేక్ష చూడటానికి అందంగా ఉంది. డాన్స్ లో ఈజ్ కూడా ఉంది. బట్ ఆమె క్యారెక్టర్ పరమ రొటీన్ గా సాగింది. ఆర్టిస్టులలో చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది రోహిణి. చాలా సహజంగా, హుందాగా ఆది తల్లి పాత్రను ఆమె పోషించారు. కొంతలో కొంత రిలీఫ్ సప్తగిరి పాత్ర ద్వారానే లభిస్తుంది. ఇతర పాత్రలను రఘు కారుమంచి, రవిప్రకాశ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, నవీనారెడ్డి, మణిచందన, గుండు సుదర్శన్ తదితరులు పోషించారు. ఈ చిత్రానికి వేణుగోపాల్ కథను అందించగా, రజనీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకర్చారు. సంభాషణలు సహజంగా ఉన్నాయి. అమర్ నాథ్‌ బొమ్మిరెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. అలానే శేఖర్ చంద్ర సంగీతం కూడా. ఒకటి రెండు పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగున్నాయి. భాస్కరభట్ల రవికుమార్ చక్కని సాహిత్యం సమకూర్చాడు. నిజానికి ఈ కాన్సెప్ట్ ను ఓటీటీని దృష్టిలో పెట్టుకుని, సింపుల్ గా గంటన్నరలో తీసి ఉంటే బాగుండేది.

ప్రస్తుతం ఆది సాయికుమార్ నిమిషం తీరిక లేకుండా ఆరేడు సినిమాలు చేస్తున్నాడు. పది రాళ్ళు వేస్తే ఒక్కటైనా తగలక పోతుందా? అనేది అతని ఆలోచన కావచ్చు. కానీ చేతికి ఏ రాయి దొరికితే దాన్ని వాడేయడం కరెక్ట్ కాదు. నిర్మాతలు రాజాబాబు, అశోక్ రెడ్డి మిర్యాలకు ఇది మొదటి చిత్రమైనా ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీపడలేదు. కానీ వారి శ్రమకు తగ్గ ఫలితం దక్కడం కష్టమే. ఇది థియేటర్లకు ‘అతిథి’లా వచ్చి వెళ్ళిపోయే సినిమానే!

ప్లస్ పాయింట్స్
సినిమాటోగ్రఫీ
సంగీతం

మైనెస్ పాయింట్
బలహీనమైన కథ
ఆకట్టుకోని కథనం

మాగల్ఫ్  రేటింగ్: 2.25/5

ట్యాగ్ లైన్: దారితప్పిన ‘అతిథి’!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com