ఐపీఎల్ మరోసారి విదేశాలకు తరలనుందా??

- January 10, 2022 , by Maagulf
ఐపీఎల్ మరోసారి విదేశాలకు తరలనుందా??

న్యూ ఢిల్లీ:కరోనా వైరస్ మొదటి, రెండవ వేవ్‌లతో ఐపీఎల్ పై తీవ్ర ప్రభావం చూపింది.2020లో ఈ టోర్నీ పూర్తిగా యూఏఈ లో నిర్వహించారు.అయితే 2021లో సగం సీజన్ భారతదేశంలో, సగం యూఏఈలో నిర్వహించారు.భారతదేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.దీంతో దేశంలోని క్రీడా కార్యక్రమాలపై మరోసారి తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా క్రికెట్ టోర్నమెంట్లకు ఆటంకం కలగనుంది. ఇలాంటి పరిస్థితిలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎదుట ప్రస్తుతం తీవ్రమైన ఆందోళన నెలకొంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించడంసౌ మల్లగుల్లాలు పడుతోంది.వరుసగా రెండు సీజన్‌ల పాటు యూఏఈ ఆతిథ్యమిచ్చిన తర్వాత, ఐపీఎల్‌ను మరోసారి దేశం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి ఉంటుందా? లేదా అనే ఆలోచనలో పడింది.

యూట్యూబ్ ఛానెల్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, టోర్నమెంట్‌కు ముందు మెగా వేలం నిర్వహించడం బీసీసీఐ ముందున్న సవాలుగా మారింది. బోర్డు మొదటి దృష్టి దానిపైనే ఉంది. అయితే, ఫిబ్రవరి రెండో వారంలో మెగా వేలం నిర్వహించే అవకాశం ఉంది. బీసీసీఐ నివేదికలు మేరకు, దేశంలోనే ఐపీఎల్ 2022ను నిర్వహించాలని కోరుకుంటోంది. అందుకు అవసరమైన అన్నిఏర్పాట్లను చేసే పనిలో నిమగ్నమైందని తెలుస్తోంది. నివేదిక ప్రకారం, “మేం అన్ని ఎంపికలను అన్వేషిస్తున్నాం. అందులో విదేశాలలో నిర్వహించడం కూడా ఒకటి. అయితే మా దృష్టి దేశంలోనే ఐపీఎల్‌ను నిర్వహించడంపైనే ఉంది. ప్రస్తుతం మా ప్రాధాన్యత వేలంపై ఉంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’’ అని వారన్నట్లు తెలుస్తోంది.

2020లో మొదటిసారిగా, కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా, బీసీసీఐ యూఏఈ లో ఐపీఎల్  నిర్వహించవలసి వచ్చింది. దీని తరువాత టోర్నమెంట్ 2021లో భారతదేశంలో ప్రారంభమైంది. కానీ, రెండవ వేవ్ వ్యాప్తి చెందడంతో, దానిని వాయిదా వేయవలసి వచ్చింది. తరువాత సగం మ్యాచ్‌లు యూఏఈలో నిర్వహించారు.

కరోనా కారణంగా,బీసీసీఐ ఇప్పటికే పెద్ద టోర్నమెంట్‌లను వాయిదా వేయాలని నిర్ణయించింది. దేశంలోని ప్రీమియర్ ఫస్ట్‌క్లాస్ టోర్నమెంట్, రంజీ ట్రోఫీ ఈ నెల 13న ప్రారంభం కావాల్సి ఉండగా, ప్రస్తుత మార్పులతో రంజీతో సహా మూడు ప్రధాన టోర్నమెంట్‌లను వాయిదా వేయాలని బోర్డు నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com