గ్రామీణప్రాంతాల్లో సేవలు అందించేందుకు యువత ముందుకు రావాలి:ఉపరాష్ట్రపతి

- January 18, 2022 , by Maagulf
గ్రామీణప్రాంతాల్లో సేవలు అందించేందుకు యువత ముందుకు రావాలి:ఉపరాష్ట్రపతి
విజయవాడ: గ్రామీణ ప్రాంతాలు సమగ్రమైన అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమౌతుందని, ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించేందుకు నిపుణులైన యువత ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విజయవాడ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఉదయం స్వర్ణభారత్ ట్రస్ట్ లోని విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు.
 
నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత మెరుగైన భవిష్యత్తును అందుకోగలరన్న ఉపరాష్ట్రపతి, వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దే దిశగా విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార సంస్థలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. యువత నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, కష్టపడి శ్రమించే తత్వం ఉన్న భారతీయ యువతకు నైపుణ్యశిక్షణను అందించడం ద్వారా, వారు మరిన్ని అవకాశాలను అవలీలగా అందిపుచ్చుకోగలరని తెలిపారు.
 
ఇదే వేదిక నుంచి చేతన ఫౌండేషన్, రామినేని ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు కుట్టుమిషన్లు, బాలబాలికలకు సైకిళ్ళు, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను ఉపరాష్ట్రపతి అందజేశారు. కష్టపడే పని చేసేవారికి సాయం అందించే ఇలాంటి సంస్థల బాటలో మరింత మంది చొరవ తీసుకోవాలని సూచించారు. మనం చేసే సాయం ఉపాధిని అందించి కష్టపడేందుకు ప్రోత్సాహం అందిచాలే తప్ప, సోమరులుగా మార్చకూడదని ఉపరాష్ట్రపతి హతవు పలికారు. అన్నీ ఉచితమేనా అనే ఆలోచన సముచితమేనా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచన చేయాలని, ప్రజలకు చక్కని నైపుణ్యాభివృద్ధిని అందించి, వారు నిలదొక్కుకునేందుకు సహకారం అందించాలే తప్ప, ఉచితాలు అలవాటు చేయడం ద్వారా ప్రయోజనం ఉండదని తెలిపారు.
ఏ స్థాయిలో ఉన్నా, ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా తనకు ఎంతో ఆనందం లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి, సంతోషమయ జీవనానికి సేవే అత్యుత్తమ సాధనమని తెలిపారు. ఆధ్యాత్మికతలోని అంతరార్ధం సాటి వారికి సేవ చేయడమేనన్న ఆయన, అనారోగ్యంతో ఉన్న వారికి వైద్య సహాయం చేయడం, వసతులు లేనివారికి విద్యాసహాయం చేయడం, ఆపదలో ఉన్నవారికి ధనసహాయం చేయడమనేది సమాజసేవ రూపంలో చేసే ఆధ్యాత్మికసేవ అన్నారు. సేవాలయాలే నిజమైన దేవాలయాలన్న ఆయన, సేవ ద్వారా లభించే సంతృప్తికి అవధులు లేవని తెలిపారు.
 
అదృష్టమంటే... కష్టపడి పని చేసే వారికి కాలం కలిసి రావడమేనన్న ఉపరాష్ట్రపతి, శ్రమించడం ద్వారా ఆత్మవిశ్వాసంతో అదృష్టాన్ని సైతం స్వాధీనం చేసుకోవచ్చని తెలిపారు. కష్టపడి పని చేసే తత్వం, క్రమశిక్షణ, విషయ పరిజ్ఞానం, ఎదిగిన కొలదీ ఒదిగి ఉండే తత్వం విజయానికి ప్రధానమన్న ఆయన, సకారత్మక ఆలోచనలతో కష్టపడడం ద్వారా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని దిశానిర్దేశం చేశారు.
 
ఈ సందర్భంగా మాతృభాష ప్రాధాన్యతను తెలియజేసిన ఉపరాష్ట్రపతి, ఓ ఉన్నతమైన భాషకు వారసుణ్ని అని చెప్పుకోవడం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, మన భాషను, తద్వారా సంస్కృతిని పరిరక్షించుకుని ముందు తరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. భారతదేశ భవిష్యత్ లో యువత పాత్ర కీలకమన్న ఆయన, ఆరోగ్యకరమైన యువతరం నవభారతాన్ని నిర్మించగలరన్నారు. ఇందుకోసం యువత చైతన్యవంతమైన జీవనశైలి ద్వారా శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, ఆధ్యాత్మిక భావాలతో మానసిక సంతులనాన్ని సాధించాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా ఇవన్నీ సుసాధ్యమని తెలిపారు.
 
యువత జాతీయ భావాలను కలిగి ఉండాలన్న ఉపరాష్ట్రపతి, సమాజహితం, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ముందుకు సాగడం, ప్రకృతిని పరిరక్షించుకోవడం, కుటుంబవ్యవస్థను పటిష్టం చేసుకోవడం లాంటివి యువత జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు. 
 
ఈ కార్యక్రమంలో చేతన ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెనిగళ్ళ రవి, ఉపాధ్యక్షులు  మోదుకూరి నారాయణ రావు, భారతీయ జనతాపార్టీ నాయకులు పాతూరి నాగభూషణం, రామినేని పౌండేషన్ నిర్వాహకులు రామినేని ధర్మప్రచారక్, స్వర్ణభారత్ ట్రస్టీలు, నిర్వహణా సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com