కువైట్ లో నిజాయితీ చాటుకున్న భారత ఉద్యోగి..

- January 21, 2022 , by Maagulf
కువైట్ లో నిజాయితీ చాటుకున్న భారత ఉద్యోగి..

కువైట్ సిటీ: కువైట్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే భారత సంతతి వ్యక్తి తన నిజాయితీ చాటుకున్నాడు.పొరపాటున కంపెనీ యాజమాన్యం ఓ బ్యాంకు ద్వారా తన అకౌంట్లోకి జమ చేసిన సుమారు రూ.1.5కోట్లను తిరిగి ఇచ్చేశాడు.దీంతో కంపెనీ యాజమాన్యం, బ్యాంకు నుంచి భారీ ప్రైజ్‌మనీతో పాటు ప్రశంస ప్రతాలు అందుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన సునీల్ డామినిక్ డీసౌజా గత 10 ఏళ్ల నుంచి కువైట్లోని ఎన్‌బీటీసీ అనే సంస్థలో ఏసీ టెక్నిషియన్‌గా పని చేస్తున్నాడు.ఈ క్రమంలో కంపెనీ నుంచి రిటైర్మెంట్ తీసుకుని స్వదేశానికి వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు.దీంతో కంపెనీ యాజమాన్యం డీసౌజా ఇన్నేళ్ల సర్వీస్ బెనిఫిట్స్‌ను అతని బ్యాంకు అకౌంట్కు ట్రాన్స్‌ఫర్ చేసింది.
కానీ, డీసౌజాకు రావాల్సిన నగదు కంటే పొరపాటున 30 రేట్లు అధికంగా బ్యాంకు వారు అతని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు.అది కూడా ఏకంగా 62,859 కువైటీ దినార్లు జమ చేశారు.దీంతో డీసౌజా వెంటనే ఈ విషయాన్ని ఎన్‌బీటీసీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. సంస్థ యాజమాన్యం ఈ విషయం బ్యాంకు వారికి తెలియజేశారు. దాంతో చెక్ చేసుకున్న బ్యాంకు సిబ్బంది టెక్నికల్ సమస్య కారణంగా ఇలా భారీ మొత్తంలో నగదు డీసౌజా ఖాతాలోకి జమ అయినట్లు గ్రహించింది.అతనికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ నగదు ఉంచి, మిగతాది వెనక్కి తీసుకుంది. 

ఇలా భారీ మొత్తం నగదు పొరపాటున తన అకౌంట్ లోకి చేరిన విషయాన్ని కంపెనీకి తెలియజేసి నిజాయితీ చాటుకున్నాడు డీసౌజా.దాంతో ఎన్‌బీటీసీ ఛైర్మన్ మహ్మద్ నజీర్ ఎం.అల్ బద్ధా గురువారం ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి డీసౌజాను ప్రశంసించారు. ప్రత్యేక ప్రశంస పత్రంతో పాటు 250 కువైటీ దినార్లప్రైజ్‌మనీ అందజేశారు. కంపెనీ అధికారులు అనిందా బెనర్జీ(సీఎఫ్ఓ గ్రూప్), బెన్ పాల్(ఎంఈపీ జనరల్ మేనేజర్) కలిసి ఓ విలువైన స్మార్ట్‌ ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. అలాగే హైవే సెంటర్‌లోని ఎన్‌బీటీసీ కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ బెన్‌సన్ అబ్రహాం కూడా డీసౌజాకు 150 కేడీల నగదు బహుమానం ఇచ్చారు.ఇక తమ పొరపాటు కారణంగా భారీ నగదు జమ అయిన కూడా నిజాయితీతో వెనక్కి ఇచ్చేసిన డీసౌజాను బ్యాంకు యాజమాన్యం కూడా సత్కరించింది.ఈ సందర్భంగా డీసౌజాకు వెయ్యి కువైటీ దినార్ల క్యాష్ ప్రైజ్‌తో పాటు ప్రత్యేక ప్రశంస పత్రాన్ని అందజేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com