బ్యాంకు సర్వర్‌లో సమస్యలే హ్యాకింగ్‌కు కారణం:సీపీ సీవీ ఆనంద్

- January 27, 2022 , by Maagulf
బ్యాంకు సర్వర్‌లో సమస్యలే హ్యాకింగ్‌కు కారణం:సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: హైదరాబాద్‌లోని మహేశ్‌ బ్యాంక్‌ పై సైబర్ క్రిమినల్స్ అటాక్ చేయడం, బ్యాంకు సెంట్రల్ సర్వర్ ని హ్యాక్ చేసి రూ.12 కోట్లు కాజేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా, హ్యాకింగ్‌ జరగడానికి కారణం ఏంటో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) సీవీ ఆనంద్‌ తెలిపారు. బ్యాంక్‌ సర్వర్‌లో లోపమే హ్యాకింగ్ కు కారణమని ఆయన స్పష్టం చేశారు. హ్యాకింగ్‌కు గురైన రూ.12.9 కోట్లు పలు ఖాతాలకు బదిలీ అయ్యాయని.. అందులో రూ.3కోట్ల వరకు నిలుపుదల చేశామని చెప్పారు.

కేసు దర్యాప్తులో మహేశ్‌ బ్యాంక్‌కు సంబంధించిన మూడు ఖాతాల నుంచి దేశంలోనే 120 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు సీపీ వివరించారు. ప్రజల ఖాతాలతో వ్యవస్థ నడిపినపుడు సరైన భద్రత కల్పించడం బ్యాంక్‌ కనీస బాధ్యతని.. నిర్లక్ష్యంగా వహించినందుకు బ్యాంకుపైనా కేసు నమోదు చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సీవీ ఆనంద్‌ తెలిపారు.

బ్యాంకు సొమ్ము దోపిడీ చేసేందుకు రెండు నెలల ముందు నుంచే ప్లాన్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఇందుకోసం ఇదే బ్యాంకులో మూడు కరెంటు అకౌంట్లు తెరిపించినట్లు చెబుతున్నారు. ముంబైకి చెందిన మహిళల ద్వారా ఈ అకౌంట్లు తెరిపించారు సైబర్ నేరగాళ్లు. ఈ పనికి హుస్సెనీఆలంలోని ఓ వ్యాపారవేత్తను ఉపయోగించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ సిద్దంబర్ బజార్, నాగోల్, హుస్సేనీ ఆలంలో.. ఈ కరెంట్ అకౌంట్లు ఉన్నాయి. ఎలాంటి అనుమానం రాకుండా వ్యక్తుల పేర్లతో కాకుండా సంస్థల పేర్లతో.. ఈ అకౌంట్లను తెరిపించారు సైబర్‌ నేరగాళ్లు.

గత ఏడాది డిసెంబర్ 23న మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో నిందితులు తొలిసారిగా కరెంట్ అకౌంట్ ఖాతా తెరిచినట్లు పోలీసులు తెలిపారు. నాగోల్ బ్రాంచ్‌లో శాన్విక ఎంటర్‌ప్రైజెస్ పేరిట ఆ ఖాతా తెరిచినట్లు చెప్పారు. ఆ తర్వాత ఈ నెల 11 పాతబస్తీలోని హుస్సేనీ ఆలం బ్రాంచ్‌లో హిందుస్తాన్‌ ట్రేడర్స్‌ పేరిట ఒక ఖాతాను, సిద్ధంబర్ బజార్‌ బ్రాంచ్‌లో మరో కంపెనీ పేరిట మరో ఖాతాను తెరిచినట్లు తెలిపారు. హుస్సేనీ ఆలంకు చెందిన ఓ వ్యాపారవేత్త సాయంతో ముంబైకి చెందిన మహిళల ద్వారా ఈ ఖాతాలు తెరిపించినట్లు గుర్తించారు.

సూపర్ అడ్మిన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలను సేకరించడం ద్వారా మహేష్ బ్యాంకు మెయిన్ సర్వర్‌ను నిందితులు హ్యాక్ చేశారు. ఇటీవల తెరిచిన మూడు కరెంట్ అకౌంట్ ఖాతాల ద్వారా దాదాపు రూ.12 కోట్లను వాటిల్లోకి మళ్లించారు.ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని దాదాపు 128 బ్యాంకు ఖాతాలకు ఆ డబ్బును ట్రాన్స్‌ఫర్ చేశారు. ప్రాక్సీ అకౌంట్లను ద్వారా ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.సుమారు 18 గంటల పాటు హ్యాకర్లు బ్యాంకు సర్వర్లను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com