తెలంగాణ: రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

- January 31, 2022 , by Maagulf
తెలంగాణ: రేపటి నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు

హైదరాబాద్: తెలంగాణలో రేపటి నుంచి భూముల విలువలు పెరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లావాదేవీలు జరుగుతాయా లేదా అన్న సందిగ్ధతకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు తెరదించారు. రాష్ట్రంలో స్థిరాస్తి మార్కెట్‌ విలువల పెంపునకు సంబంధించిన కసరత్తు పూర్తయింది.అధికారికంగా ఇవాళ ఉత్తర్వులు వెలువడనున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువను 50 శాతానికి, ఖాళీ స్థలాల విలువలను 35 శాతానికి, ప్లాట్ల విలువలను 25 శాతానికి సవరించారు.సవరించిన స్థిరాస్తి మార్కెట్‌ విలువలతో రాష్ట్ర ఖజానాకు వచ్చే రాబడిపై ప్రభుత్వ పెద్దలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కొత్త మార్కెట్‌ విలువల ప్రకారం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు 3వేల కోట్ల నుంచి 3వేల, 500 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సవరించిన మార్కెట్‌ విలువలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు 33 మంది నోడల్‌ అధికారులను నియమించడానికి కసరత్తు పూర్తి చేసింది.

మార్కెట్‌ విలువల ఉత్తర్వులతోపాటు నోడల్‌ అధికారులను కూడా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీచేయనుంది. కాగా, వ్యవసాయ భూముల విలువలను భారీగా పెంచారు. రాష్ట్రంలో 42 గ్రామాల పరిధిలో 150 శాతం, 77 గ్రామాల పరిధిలో 125 శాతం, 90 గ్రామాల పరిధిలో 100 శాతం, 472 గ్రామాల పరిధిలో 75 శాతం చొప్పున విలువలను సవరించారు. రాష్ట్రవ్యాప్తంగా కనీస విలువల పెరుగుదలను 50 శాతానికి సవరించినట్లు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో భారీగా డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో కేవలం 10 నుంచి 20 శాతం వరకు మార్కెట్‌ విలువలను పెంచారు. 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య ధరలు పలుకుతున్న ప్రాంతాల్లో 20 శాతానికి సవరిస్తే, 10 కోట్లకుపైగా ధరలు ఉన్న భూములకు 10 శాతం వరకు పెంచారు. ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువల ఖరారులో భాగంగా... కొన్ని ప్రాంతాల్లో జిల్లా కేంద్రాల కంటే అక్కడి పట్టణ పరిధిలో ఎక్కువగా మార్కెట్‌ విలువలను నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com