రివ్యూ: స‌న్ ఆఫ్ ఇండియా

- February 18, 2022 , by Maagulf
రివ్యూ: స‌న్ ఆఫ్ ఇండియా

టైటిల్‌: సన్ ఆఫ్ ఇండియా 

నటీనటులు: డాక్ట‌ర్ మోహ‌న్ బాబు, మీనా , శ్రీ‌కాంత్, ప్ర‌గ్యా జైస్వాల్, త‌నికెళ్ళ భ‌ర‌ణి, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర‌, ర‌విప్ర‌కాశ్, బండ్ల గ‌ణేశ్ తదితరులు

నిర్మాత: మంచు విష్ణు
దర్శకత్వం: డైమండ్ ర‌త్న‌బాబు
సంగీతం: ఇళ‌య‌రాజా
విడుదల తేది: ఫిబ్రవరి 18, 2022

క‌థ: క‌డియం బాబ్జీ అనే వ్య‌క్తి ఓ కేంద్ర‌మంత్రిని, ఓ లేడీ డాక్ట‌ర్ ను, దేవాదాయ శాఖ చైర్మ‌న్ కిడ్నాప్ చేస్తాడు. దాంతో య‌న్.ఐ.ఏ. రంగంలోకి దిగుతుంది. ఐరా అనే లేడీ ఆఫీస‌ర్ త‌న అసిస్టెంట్స్ తో ప‌రిశోధ‌న‌కు దిగుతుంది. వారిని సంఘ‌ట‌నా స్థ‌లికి ఓ డ్రైవ‌ర్ తీసుకు వెళ‌తాడు. అత‌ను క‌డియం బాబ్జీనే. త‌రువాత ప‌రిశోధ‌న చేసిన వారికి అత‌డే కిడ్నాప‌ర్ అని తెలుస్తుంది. అప్పుడు త‌న గ‌తాన్ని వివ‌రిస్తాడు బాబ్జీ. అత‌ని అస‌లు పేరు బాబ్జీ కాదు. విరూపాక్షి అనే ప్రెస్ ఓన‌ర్. ఓ ఎమ్మెల్యే అత‌ని వ‌ద్ద‌నే పోస్ట‌ర్స్ ప్రింట్ చేయించుకుంటూ ఉంటాడు. గెలుస్తుంటాడు. ఆ సెంటిమెంట్ తో మ‌రోమారు త‌న పోస్ట‌ర్స్ విరూపాక్షి ప్రెస్ లోనే ముద్రించాల‌ను కుంటాడు. ఆ స‌మ‌యంలో విరూపాక్షి త‌న కూతురును ప‌ట్నంలో ప‌రీక్ష రాయించ‌డానికి తీసుకువెళ్తూ, ఆ ప‌ని అసిస్టెంట్స్ కు అప్ప చెబుతాడు. పొర‌పాటున ఎమ్మెల్యే బొమ్మ బ‌దులు త‌మ య‌జ‌మాని బొమ్మ‌నే పెట్టి ప్రింట్ చేస్తారు.అది తెలిసిన ఎమ్మెల్యే హీరో కూతురు, భార్య‌ను చంపేస్తారు. ఎమ్మెల్యే కావాల‌న్న ఉద్దేశంతోనే సొంత భార్యాబిడ్డల‌ను చంపాడ‌ని హీరోని జైలులో వేయిస్తారు. త‌ప్పించుకొని వ‌చ్చి, హీరో త‌న‌కు అన్యాయం చేసిన వారిని హ‌త‌మారుస్తాడు. 16 ఏళ్ళు శిక్ష ప‌డుతుంది. జైలు శిక్ష అనుభ‌విస్తూనే లా పూర్తి చేసిన హీరో, అక్క‌డ ఎంతోమంది అన్యాయంగా జైలులో ఉన్నార‌ని తెలుసుకొని, వారికి అన్యాయం చేసిన వారిని బ‌య‌ట‌కు వ‌చ్చాక కిడ్నాప్ చేసి ఉంటాడు. వారిని త‌న సొంత‌జైలులో ఉంచి శిక్షించాల‌నుకుంటాడు. లాయ‌ర్ల‌కు, డాక్ట‌ర్ల‌కు సొంతగా ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండ‌గా, తాను కూడా నేర‌స్థుల‌ను శిక్షించ‌డానికి త‌న సొంత‌జైలు ఏర్పాటు చేశానంటాడు హీరో. దాంతో అత‌ని అభిప్రాయాన్నిజ‌నం అభినందిస్తూండ‌గా క‌థ ముగుస్తుంది.

గ‌తంలోనూ ఎంద‌రో సీనియ‌ర్ హీరోలు వ‌య‌సు మ‌ళ్ళిన త‌రువాత దేశ‌భ‌క్తి ప్ర‌ధాన‌మైన క‌థ‌ల్లో న‌టించారు. అదే రూటులో మోహ‌న్ బాబు సాగార‌నిపిస్తుంది. లోగ‌డ మోహ‌న్ బాబు నిర్మించి,న‌టించిన పుణ్య‌భూమి నా దేశంలోనూ ఆయ‌న దేశ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించారు. ఇందులో ఆ పాలు మ‌రింత పెరిగింద‌ని చెప్పాలి. మోహ‌న్ బాబుకు ఉన్న ఎస్సెట్ ఆయ‌న వాచ‌కం. ఆయ‌న గ‌ళం నుండి జాలువారిన కొన్ని విన‌సొంపైన ప‌దాలు అల‌రిస్తాయి. అయితే అవి పుంఖానుపుంఖాలుగా సాగ‌డ‌మే ప్రేక్ష‌కుడి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంది. ఈ చిత్రంలో పాత వాస‌న‌లే అధికంగా ఉండ‌డంతో న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం అసాధ్య‌మే అనిపిస్తుంది. ఎమ్ఎల్ఏ బొమ్మ బ‌దులు హీరో బొమ్మ పోస్ట‌ర్స్ లో ప్ర‌త్య‌క్షం కావ‌డం కామెడీగానే ఉంది. పైగా సినిమాలో ఎంతో మంది ప్ర‌ముఖ న‌టీన‌టులు ఉన్నా, హీరోనే ఎక్కువ‌గా ఎలివేట్ చేశారు. కొన్ని సీన్స్ లో ఇత‌ర ఆర్టిస్టుల‌ను బ్ల‌ర్ కూడా చేశారు. ఇదో ప్ర‌యోగ‌మ‌ని ద‌ర్శ‌కుడు ముందే చెప్పారు. కానీ, ఈ ప్ర‌యోగం విక‌టించింద‌నే చొప్పొచ్చు. ఇళ‌య‌రాజా నేప‌థ్య సంగీతం మునుప‌టిలా సాగ‌లేద‌నే చెప్పాలి.

ప్ల‌స్ పాయింట్స్:
మోహ‌న్ బాబు వాచ‌కాభిన‌యం
ప్ర‌గ్యాజైస్వాల్ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్:
అంత‌గా అల‌రించ‌లేక పోయిన క‌థ‌, క‌థ‌నం
కొత్త‌ద‌నం లోపించ‌డం
సినిమా చిన్న‌దే అయినా,సాగ‌దీత అనిపించ‌డం

మాగల్ఫ్ రేటింగ్: 2.5 /5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com