8 మంది భారత, ఈజిప్ట్ ప్రవాసులకు 10 ఏళ్ల జైలు!

- February 20, 2022 , by Maagulf
8 మంది భారత, ఈజిప్ట్ ప్రవాసులకు 10 ఏళ్ల జైలు!

కువైట్ సిటీ: కువైట్ లో డబ్బుకు ఆశపడి తప్పుడు రిపోర్టులు తయారు చేస్తున్న 8 మంది భారత్, ఈజిప్ట్‌కు చెందిన ప్రవాసులకు కువైట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ జడ్జి నాజర్ సలేం అల్ హైద్ 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.కోర్టులో పేర్కొన్న సభా అల్ సలేం హెల్త్ లేబొరేటరీలో పనిచేసే భారత్,ఈజిప్ట్‌కు చెందిన ప్రవాస సిబ్బంది రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను తయారు చేసే సమయంలో లంచం తీసుకుని తప్పుడు నివేదికను ఇచ్చేవారు.ఆరోగ్య పరీక్షల కోసం వచ్చే ప్రవాసుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటూ గత కొంతకాలంగా ఈ దందా చేస్తున్నారు.ప్రవాసులకు ఉండే దీర్ఘకాలిక రోగాలను దాచి పెట్టి వారికి కావాల్సినట్టుగా రిపోర్టులు తయారు చేయడం లేబొరేటరీ సిబ్బంది చేస్తున్న నిర్వాకం.ఈ విషయమై కొందరు ప్రవాసులు కువైత్ ఆరోగ్యమంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన అంతర్గత మంత్రిశాఖతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు సభా అల్ సలేం హెల్త్ లేబొరేటరీలో తనిఖీలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఇంతకు ముందు సిద్ధం చేసి పెట్టిన ప్రవాసుల ఫేక్ హెల్త్ రిపోర్టులను పరిశీలించారు.అనంతరం ఆ రిపోర్టు తాలూకు నలుగురు వ్యక్తులను పిలిపించి మరోసారి హెపటైటిస్-బీ, సీతో పాటు హెచ్ఐవీ కోసం రక్త పరీక్షలు నిర్వహించాలని లాబొరేటరీ సిబ్బందిని ఆదేశించారు.దీంతో రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరు ప్రవాసులకు హెపటైటిస్-బీ ఉన్నట్లు నిర్ధారణ కాగా,మరో ఇద్దరికి హెపటైటిస్-సీ ఉన్నట్లు తేలింది. కానీ, లాబొరేటరీ సిబ్బంది అంతకుముందు డబ్బులు తీసుకుని రెడీ చేసిన నివేదికలో ఆ నలుగురు ప్రవాసులకు ఎలాంటి అనారోగ్యం లేదని ఉంది.ఇలా గత కొంత కాలంగా సభా అల్ సలేం హెల్త్ లేబొరేటరీలో పని చేస్తున్న 8 మంది భారత, ఈజిప్ట్‌కు చెందిన ప్రవాస సిబ్బంది తమ వద్దకు రక్త పరీక్షల కోసం వచ్చే వలసదారుల నుంచి అందినకాడికి దోచుకుంటూ తప్పుడు నివేదికలు ఇస్తోంది.తాజాగా ఈ కేసు కువైట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో విచారణకు రావడంతో దోషిగా తేలిన 8 మంది సిబ్బందికి జడ్జి నాజర్ సలేం అల్ హైద్ 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com