వాస్తవాలతో కూడిన భారతీయ చరిత్రను పునర్లిఖించే దిశగా ముందుకు సాగాలి: ఉపరాష్ట్రపతి

- March 28, 2022 , by Maagulf
వాస్తవాలతో కూడిన భారతీయ చరిత్రను పునర్లిఖించే దిశగా ముందుకు సాగాలి: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: వాస్తవ ఘటనల ఆధారంగా నిజమైన భారతదేశ చరిత్రను పునర్లిఖించేందుకు చరిత్రకారులు మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.  చరిత్ర పరిశోధనలో లోతైన అధ్యయనం చేస్తూనే.. భారతీయ వైభవోపేతమైన చరిత్రను తప్పుగా చూపించేందుకు జరుగుతున్న కుట్రలను కూడా చరిత్రకాలే తిప్పికొట్టాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. భారతీయ చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్) వంటి సంస్థల ద్వారా చరిత్రను శాస్త్రీయ పరమైన పద్థతిలో పరిశోధించాలని అన్నారు.

ఐసీహెచ్ఆర్ స్వర్ణజయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి.. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని విశిష్టమైన ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటుచేసిన ప్రదర్శనను కూడా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో సర్వస్వాన్ని కోల్పోయిన వీరుల గురించి భారతీయ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మాతృదేశానికి బానిస సంకెళ్లనుంచి విముక్తి కల్పించేందుకు విశిష్టమైన త్యాగాలు చేసినా గుర్తింపునకు నోచుకోని వీరులు, వీరాంగనల గురించి తెలుసుకుని భవిష్యత్ భారతం వారి జీవితగాథలనుంచి ప్రేరణ పొందాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఇలాంటి వీరుల గురించి కథలు, డాక్యుమెంటరీలు, సినిమాలు తీసుకురావడం ద్వారా సమాజంపై ఎంతో ప్రభావం ఉంటుందన్న ఉపరాష్ట్రపతి ఈ విషయంలో రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు. కుల, మత, ప్రాంత భేదాభిప్రాయాలకు అతీతంగా కేవలం జాతీయవాద భావనతోనే ఈ అంశాలను గమనించాలని ఆయన సూచించారు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో పద్ధతిలో విదేశీదురాక్రమణ దారులపై పోరాటాలు జరిపిన వారి గాథలను వివిధ భారతీయ భాషల్లోనూ అనువాదాలు చేయించి పాఠ్యపుస్తకాలు, ప్రత్యేక సంచికల ద్వారా విస్తృతం చేయాలని అప్పుడే సంపూర్ణ భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులపై విద్యార్థులు, యువతకు అవగాహన కలుగుతుందని పరిశోధనకారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. చరిత్ర అనువాదం కూడా కీలకమైన పని అని ఈ దిశగా విస్తృతమైన పన జరగాలని ఆయన సూచించారు.
సహనం, పరస్పర సమన్వయం, సోదరభావాన్ని భారత స్వాతంత్ర్య సంగ్రామం ప్రతిబింబించిందని.. అదే భావనతో యువత ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రాంతీయ భావలను పక్కనపెట్టి మనమంతా భారతీయులం అనే భావనను అలవర్చుకోవాలన్నారు. 
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున ఉభయసభల సభ్యులు ఈ ప్రదర్శనను తిలకించాలన్న ఉపరాష్ట్పతి.. ఇలాంటి ప్రదర్శనలను వారి వారి నియోజకవర్గాల్లో ఏర్పాటుచేయడం ద్వారా ఈ స్ఫూర్తిని మారుమూల ప్రాంతాల వరకు తీసుకెళ్లేందుకు వీలవుతుందన్నారు.

ఐసీహెచ్ఆర్ సంస్థ 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సంస్థను, సంస్థ బాధ్యులను, చరిత్ర పరిశోధకులను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. 

ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఐసీహెచ్ఆర్ చైర్మన్ ప్రొఫెసర్ రాఘవేంద్ర తన్వర్, మాజీ చైర్మన్ ప్రొఫెసర్ అరవింద్ జంఖేడ్ కర్, ఐసీహెచ్ఆర్ సభ్యకార్యదర్శి ప్రొఫెసర్ కుమార్ రత్నంతోపాటు చరిత్ర పరిశోధకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com