శ్రీవారి భక్తులకు శుభవార్త...

- March 31, 2022 , by Maagulf
శ్రీవారి భక్తులకు శుభవార్త...

తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది.దాదాపు రెండేళ్ల తర్వాత శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవల్లో భక్తులు పాల్గొనేలా అవకాశాన్ని కల్పించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది.కోవిడ్‌ కేసులు తగ్గిపోయిన క్రమంలో తిరుమలలో అధికారులు పాత పద్ధతులను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు.ఇందులో భాగంగానే 2020 మార్చి 20న రద్దు చేసిన ఆర్జిత సేవలకు రేపటి నుంచి భక్తులను తిరిగి అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.

ఏప్రిల్‌ నెలతో పాటు మే, జూన్‌ నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను మార్చి 20న ఆన్‌లైన్‌ కోటాను విడుదల చేశారు. ఆఫ్‌లైన్‌లోనూ డిప్‌ విధానం ద్వారా సేవలు కేటాయించే విధానాన్ని కూడా మొదలుపెట్టాలని నిర్ణయించిన టీటీడీ.. తిరుమలలోని సీఆర్వో కార్యాలయంలో కౌంటర్లను సిద్ధం చేస్తోంది.రేపటి నుంచి ఆర్జితసేవలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటల నుంచి 5 గంటల దాకా భక్తులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

సాయంత్రం 6 గంటలకు ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా భక్తులకు సేవను కేటాయిస్తారు. అడ్వాన్స్‌ బుకింగ్‌లో ఆర్జితసేవలు పొందిన భక్తులు రాకపోతే ఆ టికెట్లను కరెంట్‌ బుకింగ్‌ కోటాకు మళ్లించి రాత్రి 8.30 గంటలకు రెండవ డిప్‌ ద్వారా భక్తులకు కేటాయిస్తారు. వీరు రాత్రి 11 గంటలలోపు టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అటు వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో కొత్త దంపతులు పాల్గొనే అవకాశాన్ని కూడా టీటీడీ రేపటి నుంచి కల్పించనుంది. వివాహ పత్రిక, లగ్నపత్రిక, ఫొటో గుర్తింపుకార్డుల ద్వారా ఈ టికెట్లను కేటాయించనున్నారు.వివాహమైన ఏడు రోజులలోపు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com