త్వరలో కడప నుంచి హైదరాబాద్ కు విమాన సర్వీస్

- June 11, 2015 , by Maagulf
త్వరలో కడప నుంచి హైదరాబాద్ కు విమాన సర్వీస్

వై.యస్.ఆర్ కడప జిల్లాలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా విమానయాన సేవలు అందుబాటులో తెస్తామని కలెక్టర్ కేవీ రమణ అన్నారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాలులో పారిశ్రామికవేత్తలు, జిల్లా అధికారులతో ఈ అంశంపై ఆయన సమీక్షించారు. ఈనెల 7న సీఎం చంద్రబాబు కడప-బెంగుళూరు విమాన సర్వీసులు ప్రారంభించారన్నారు. ఎయిర్ పెగాసెస్ సంస్థ వారంలో మూడు రోజులు కడప-బెంగుళూరు మధ్య సర్వీసులు నడుపుతోందని పేర్కొన్నారు. ఈ విమానయాన సర్వీసులను ఇతర ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిర్ పెగాసెస్ సంస్థ త్వరలోనే కడప నుంచి హైదరాబాదుకు విమాన సర్వీసు నడపనుందని వెల్లడించారు. జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు రామ్మూర్తి మాట్లాడుతూ ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్న వారు జిల్లాలో అధికంగా ఉన్నందువల్ల కడప-బెంగుళూరు-హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు. కడప నుంచి విమాన సర్వీసులు శనివారం ఉదయం, సోమవారం ఉదయం ఏర్పాటు చేస్తే ఐటీ ఉద్యోగులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. కడప నుంచి చెన్నైకి కూడా విమాన సర్వీసు నడిపితే డిమాండ్ ఉంటుందన్నారు. ఈ విషయంపై ఎయిర్ పెగాసెస్ యాజమాన్యంతో మాట్లాడి చెన్నైకి కూడా సర్వీసులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఎయిర్ ట్రావెల్ పెరిగేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి వసతులు కల్పిస్తామని ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కొండారెడ్డి తెలిపారు. ఈ సమావేశ ప్రారంభంలో పర్యాటకశాఖ జిల్లా అధికారి గోపాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, ఏపీఎండీసీ అధికారి కేదార్‌నాథ్‌రెడ్డి, ప్యాప్సీ, రాయలసీమ థర్మల్ పవర్, ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు, పలువురు చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

 

                                                                                      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com