సమాజ సేవతో భారతదేశ అస్తిత్వం ముడిపడి ఉంది: ఉపరాష్ట్రపతి

- April 27, 2022 , by Maagulf
సమాజ సేవతో భారతదేశ అస్తిత్వం ముడిపడి ఉంది: ఉపరాష్ట్రపతి
నెల్లూరు: సమాజ సేవతో భారతదేశ అస్తిత్వం ముడిపడి ఉందని... సంపదను పెంచుకోవడం, దాన్ని పదిమందితో పంచుకోవడంలో ఉన్న ఆనందం మరెందులోనూ లభించదని గౌరవ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి తోడుపడవోయ్ అన్న గురజాడవారి మాటల స్ఫూర్తితో సమాజంలో సేవాకార్యక్రమాలు మరింత ముమ్మరం కావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
 
బుధవారం నెల్లూరు దగ్గరలోని అల్లూరులో శ్రీమతి దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్టును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భారతదేశ సంస్కృతి, సంప్రదాయంలో భాగమై మన అస్తిత్వానికి మూలమైన పంచ యజ్ఞాలను ప్రస్తావించారు. మొదటిదైన బ్రహ్మ యజ్ఞం అంటే విద్యాసముపార్జన ద్వారా విజ్ఞానవంతులు కావడమని, రెండోదైన పితృ యజ్ఞం ద్వారా తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించుకోవాలని, మూడోదైన దైవయజ్ఞం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం, నాలుగోదైన భూతయజ్ఞం ద్వారా సాటి జీవుల పట్ల, పశుపక్షాదుల పట్ల ప్రేమగా మసులుకోవడం, ఐదవదైన నృయజ్ఞం అంటే మనకున్న దానిలో కొంతభాగాన్ని సమాజ శ్రేయస్సుకోసం కేటాయించడమని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఈ స్ఫూర్తిని సమాజంలోని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.
 
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులతోపాటు మంచితనాన్ని, నైతికతను, మానవత్వాన్ని, సమాజం పట్ల బాధ్యతను వారసత్వంగా అందించడం ద్వారా మరింత సంతృప్తిని పొందవచ్చన్నారు.  భార్యపేరు మీద ఇలాంటి స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన శ్రీ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులను ఉపరాష్ట్రపతి అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం ఇలాగే ముందడుగేయాలన్నారు. 
సమాజసేవ విషయంలో తన మనసులో ఉన్న స్వర్ణభారత్ ట్రస్ట్ ఆలోచనను, చొరవ తీసుకుని తన కుమార్తె శ్రీమతి దీపా వెంకట్, తన మిత్రుల సహకారంతో సాకారం చేసిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. తన కుమారుడైన శ్రీ ముప్పవరపు హర్ష సైతం ముప్పవరపు ఫౌండేషన్ పేరుతో, స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం తననెంతగానో ఆనందింపజేసిందన్నారు.
 
ప్రతి ఊరిలోనూ ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక వైద్యాలయం, ఒక దేవాలయం ఉండాలని వీటితోపాటుగా ఒక సేవాలయం కచ్చితంగా ఉండాలన్నది తన ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు తమ తమ గ్రామాల్లో ఓ సేవాలయాన్ని ఏర్పాటు చేసేందుకు గానీ, ఇతరులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తోడ్పాటు అందించేందుకు ముందుకు రావాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
 
సనాతన భారతీయ సంస్కృతి సేవను అత్యుత్తమ ధర్మంగా తెలియజేసిందన్న ఉపరాష్ట్రపతి, రామాయణ, భారత, ఇతిహాసాల్లో ఇందుకు సంబంధించిన ఎన్నో ఉదాహరణలు కనబడతాయన్నారు. సేవను మించిన భగవదారాధన లేదనే విషయాన్ని తానెప్పుడూ చెబుతుంటానని, సేవ అంటే పెద్ద పెద్ద పనులు చేయడమే కాదని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి నీళ్ళందించడం, మీ సమయంలో కొంత భాగాన్ని సమాజం కోసం కేటాయించడం ఇలాంటి పనులేవైనా సేవా మార్గమేనని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 
ముఖ్యంగా యువతరం ఈ దిశగా ఆలోచించి, తమ ఖాళీ సమయాన్ని సమాజసేవకు వినియోగించాలన్నారు. ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్న నిరక్షరాస్యులకు సహాయం చేయాలని, వయసులో పెద్ద వారికి సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు  రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, దేవిరెడ్డి శారద చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ట్రస్టీ దశరధ రామిరెడ్డి, ఇతర ట్రస్టీలు, కుటుంబ సభ్యులు, పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com