ఉత్తరాది, దక్షిణాది వారి మధ్య మాటల యుద్ధం.. జాతీయ భాషపై రగడ..

- April 29, 2022 , by Maagulf
ఉత్తరాది, దక్షిణాది వారి మధ్య మాటల యుద్ధం.. జాతీయ భాషపై రగడ..

హిందీ జాతీయ భాషగా పరిగణించాలా? మూడునాలుగు రాష్ట్రాల్లో తప్ప వేరే ఎక్కడా లేని హిందీ భాషను దేశ భాషగా గుర్తించాలా? దీనిపై ఉత్తరాది, దక్షిణాది వారి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

దేశంలో ఏ రాష్ట్రానికి ఆ భాష ఉంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, కొంకణి ఇలా ఎన్నో భాషలు ఉండగా.. ఒక్క హిందీనే దేశం మొత్తంపై రుద్దడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది.

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌, కన్నడ స్టార్‌ కిచ్చా సుదీప్‌ మధ్య హిందీపై కామెంట్ చేశారు. పాన్‌ ఇండియా స్థాయిని కన్నడ చిత్ర పరిశ్రమ దాటేసిందని సుదీప్‌ మాట్లాడారు. ఇకపై హిందీ జాతీయ భాష కాదని, ఒకవేళ హిందీ జాతీయ భాషే అనుకున్నప్పుడు.. బాలీవుడ్‌ సినిమాలన్నీ అన్ని రాష్ట్రాల్లోనూ హిందీలోనే రిలీజ్‌ చేయాలి కదా అన్నది సుదీప్‌ ఉద్దేశం.

కాని, బాలీవుడ్‌ సినిమాలను సైతం ఇతర భాషల్లోకి డబ్‌ చేస్తున్నప్పుడు ఇక హిందీ జాతీయ భాష ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అజయ్‌ దేవగణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు కన్నడ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్‌ చేస్తున్నారంటూ అజయ్‌ దేవగణ్‌ రిప్లై ఇచ్చారు. పార్టీలకు అతీతంగా సుదీప్‌కే ఎక్కువ మద్దతు లభించింది.

అజయ్‌ దేవగణ్‌ వ్యాఖ్యలను సీఎం బసవరాజ బొమ్మైతో పాటు మాజీ ముఖ్యమంత్రులు కుమారస్వామి, సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. అసలు హిందీ జాతీయ భాష కానే కాదని, దేశంలో ఉన్న అనేక భాషల్లో అదీ ఒకటి మాత్రమేనని పలువురు నేతలు స్పష్టం చేశారు. భారతదేశంలో 19వేల 500 భాషలు ఉన్నాయని, భారతదేశ కరెన్సీ నోటుపైనా చాలా భాషలున్నాయని, అలాంటప్పుడు ఏదో ఒకటి జాతీయ భాషగా ఎందుకు ఉండాలని ట్వీట్ చేశారు జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా.

అజయ్‌ దేవగణ్‌ మాటల్లో.. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే భాష, ఒకే ప్రభుత్వం అనే బీజేపీ హిందీ జాతీయ వాదం వినిపిస్తోందని జేడీఎస్‌ నేత కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. అటు రామ్‌గోపాల్‌ వర్మ కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యారు. దక్షిణాది చిత్రాలు మంచి వసూళ్లు రాబడుతుండటంతో బాలీవుడ్‌ నటులు అభద్రత, అసూయతో ఉన్నారని కామెంట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com