గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం: కవిత

- June 12, 2015 , by Maagulf
గల్ఫ్ నా ఎనిమిదో నియోజకవర్గం: కవిత

ఎడారిలో ఉన్నా.. ప్రవాసీయులు నూటికి నూరుపాళ్లు తెలంగాణ బిడ్డలేనని, వాళ్ల పేర్లను రేషన్ కార్డుల్లోంచి తొలగించకుండా చూస్తానని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రాష్ట్ర పరిధిలోని ప్రతి సమస్యనూ పరిష్కరించేందుకు తాను చిత్తశుద్ధితో ప్రయత్నిస్తానని, కేంద్రంపై కూడా ఒత్తిడి తెస్తానని తెలిపారు. గల్ఫ్ పర్యటనలో ఉన్న కవిత.. తెలంగాణ జాగృతి నేత హరిప్రసాద్‑తో కలిసి శుక్రవారం బహ్రెయిన్‑లో కార్మిక క్యాంపులను సందర్శించి, అక్కడ కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్ కాకతీయతో గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయం పెరుగుతుందని, ఇక ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస రావాల్సిన అవసరం ఉండబోదని ఆమె చెప్పారు.
సుదూర తీరాలకు వచ్చి నాలుగైదు వేల రూపాయలు సంపాదించేకంటే, ఇంట్లోనే ఉండి వ్యవసాయం చేసుకుని అంతకంటే ఎక్కువ సంపాదించవచ్చని కవిత తెలిపారు. గల్ఫ్‑లో ఉన్నవాళ్లు తమ పిల్లలను బాగా చదివించి, వృత్తిపరమైన కోర్సులు చేయాలని, ఈ వికాసం బంగారు తెలంగాణకు ఉపయోగపడుతుందని, ఇందులో ప్రవాసీయుల పాత్ర గణనీయమైనదని ఆమె అన్నారు. తన లోక్‑సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నవి ఏడు సెగ్మెంట్లు కావని, గల్ఫ్‑తో కలుపుకొంటే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లని కవిత అన్నారు. అంతకుముందు హరిప్రసాద్ నివాసంలో తెలంగాణ మహిళలతో సమావేశమై బహ్రెయిన్‑లో బతుకమ్మ నిర్వహణపై సమీక్షించారు. బహ్రెయిన్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కవిత వెంట సామా రాజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులున్నారు.

 

--యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com