కాబూల్‌లోని గురుద్వారాలో బాంబు పేలుళ్లు...

- June 18, 2022 , by Maagulf
కాబూల్‌లోని గురుద్వారాలో బాంబు పేలుళ్లు...

కాబూల్‌: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని గురుద్వారా కర్తే పర్వాన్ ప్రాంతం శనివారం ఉదయం బాంబు పేలుళ్లు, కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది.ఆ సమయంలో గురుద్వారాలో కొందరు భక్తులు కూడా ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. అయితే, అక్కడ చోటు చేసుకున్న మరణాలు, క్షతగాత్రుల వివరాలను చెప్పలేదు. గురుద్వారా కర్తే పర్వాన్ వద్ద ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

దీంతో కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. గురుద్వారాలోని రెండు గేట్ల వద్ద కూడా పేలుళ్లు జరిగాయని స్థానిక మీడియా తెలిపింది. గురుద్వారా ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కనపడ్డాయి. ఐఎస్ఐఎస్ ఖొరాసాన్ ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేలుళ్లు జరిగిన సమయంలో గురుద్వారాలో దాదాపు 30 మంది హిందూ-సిక్కులు ఉన్నట్లు తెలుస్తోంది.

వారిలో దాదాపు 15 మంది పేలుళ్ల నుంచి తప్పించుకుని వెళ్లారని, మిగతావారు గురుద్వారాలోనే ఇరుక్కుపోయారని స్థానికులు అంటున్నారు. గురుద్వారాలో పేలుళ్ల పై భారత్ స్పందించింది. గురుద్వారాలో జరిగిన ఉగ్రదాడి పై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ పేలుళ్లకు సంబంధించిన వివరాలను తెలుసుకుంటామని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com