‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ

- June 22, 2022 , by Maagulf
‘అగ్నిపథ్’ను కేంద్రం వెనక్కు తీసుకోవాలి: రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ:  ‘అగ్నిపథ్’ స్కీంను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. జాతీయ వాద పార్టీగా చెప్పుకొనే బీజేపీ దేశ సైన్యాన్ని మరింత బలోపేతం చేయాల్సింది పోయి బలహీన పరుస్తోందని రాహుల్ విమర్శించారు. న్యూ ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అగ్నిపథ్‌ స్కీంపై, బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కు తీసుకోవాలి. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ అనే స్కీం నుంచి నో ర్యాంక్-నో పెన్షన్ అనే విధానం వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రభుత్వం భద్రతా దళాలను మరింత బలహీన పరుస్తోంది. ఒకపక్క చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంటున్న దశలో ఇలాంటి చర్య సరికాదు. ఒకవేళ యుద్ధం వస్తే మన సైన్యం బలహీనంగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశానికి మూల స్తంభంగా నిలిచే చిన్న తరహా, మధ్య తరహా వ్యాపార సంస్థల్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశ యువతకు కావాల్సిన అవకాశాల్ని కేంద్రం కల్పించలేకపోతుంది. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం వెనక్కు తగ్గుతుందని నేను గతంలో చెప్పినట్లుగానే ఆ చట్టాల్ని ఉపసంహరించుకుంది. ఇప్పుడు అగ్నిపథ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ విషయంలో దేశ యువత మా వెంటే ఉంది’’ అని రాహుల్ అన్నారు.

మరోవైపు ఈడీ తనను విచారించడంపై కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలపై కూడా ఆయన స్పందించారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు ఓపికతో ఉండాలని సూచించారు. 2004 నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తనను ఓపిక, సహనం వంటివే శక్తిమంతున్ని చేశాయని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com