అదానీ 60వ పుట్టిన రోజు..భారీ విరాళం

- June 23, 2022 , by Maagulf
అదానీ 60వ పుట్టిన రోజు..భారీ విరాళం

ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.అదానీ, అతడి కుటుంబం కలిసి రూ.60 వేల కోట్లు సమాజ సేవకు వెచ్చించనున్నట్లు ప్రకటించారు.ఈ భారీ విరాళాన్ని అదానీ ఫౌండేషన్ నిర్వహిస్తుందని ఆయన గురువారం మీడియాకు వెల్లడించారు.

విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తన తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి సందర్భంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గౌతమ్ అదానీ చెప్పారు. ‘‘శుక్రవారం నా పుట్టిన రోజు సందర్భంగా నేను, నా కుటుంబం కలిసి రూ.60 వేల కోట్లు సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని నిర్ణయించుకున్నాం. భారత దేశ కార్పొరేట్ చరిత్రలోనే ఇది అతిపెద్ద విరాళం. విద్య, వైద్యం, నైపుణ్యాల పెంపు వంటి అంశాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తాం. ఈ నిధుల కేటాయింపు, వ్యయం వంటి అంశాలకు తుదిరూపు ఇవ్వడానికి నిపుణులతో కూడిన మూడు కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీల్లో నా కుటుంబ సభ్యులు కూడా ఉంటారు’’ అని అదానీ వెల్లడించారు.

వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల విక్రయ సంస్థగా 1988లో అదానీ గ్రూపు ప్రారంభమైంది. చిన్న వ్యాపార సంస్థగా మొదలై, ఇప్పుడు అంతర్జాతీయ సంస్థగా ఎదిగింది.తాజా విరాళం ప్రకటనతో అదానీ.. మార్క్ జుకర్ బర్గ్, వారెన్ బఫెట్ వంటి భారీ విరాళాలు ప్రకటించిన వారి సరసన చేరారు. బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా అంచనా ప్రకారం అదానీ సంపద విలువ 92 బిలియన్ డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com