6నెలల్లో 10,000 మంది పైగా ప్రవాసుల దేశ బహిష్కరణ..

- June 24, 2022 , by Maagulf
6నెలల్లో 10,000 మంది పైగా ప్రవాసుల దేశ బహిష్కరణ..

కువైట్ సిటీ: కువైట్ లో  గతకొంత కాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు చేస్తూ అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తోంది. ఇలా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఏకంగా 10వేలకు పైగా మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. వీరిలో అధిక శాతం మంది రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన వారేనని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే చాలా మంది ఉపాంత కార్మికులు అని అధికారులు తెలిపారు. జనవరి 1 నుంచి జూన్ 20 వరకు 10,800 మంది వలసదారులను దేశం నుంచి బహిష్కరించింది. అంతేగాక బహిష్కరణకు గురైన వారిలో జలీబ్ అల్ షుయౌఖ్, మహబౌలా, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతం, బిన్నీద్ అల్ గార్, వఫ్రా ఫార్మ్స్, అబ్దాలీ ప్రాంతాల్లో నివాసముండే బ్యాచిలర్లు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు.ఈ సోదాలు మునుముందు కూడా ఇలాగే కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు చెప్పుకొచ్చారు. 

దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ అహ్మద్ అల్ నవాఫ్, మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్ జనరల్ అన్వర్ అల్ బర్జాస్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిని ఉపేక్షించేది లేదని, ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులు తప్పించుకోవడానికి వీల్లేదని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దీంతో సెక్యూరిటీ సిబ్బంది ప్రవాసులు అధికంగా నివాసం ఉండే రెసిడెన్సీ ప్రాంతాలపై వరుస సోదాలు నిర్వహిస్తున్నారు.ఇక ఇప్పటికే పలుమార్లు అమ్నెస్టీ పేరిట రెసిడెన్సీ గడువు ముగిసిన వారిని దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు అవకాశం కల్పించింది కువైట్ ప్రభుత్వం. కానీ, చాలా మంది ప్రవాసులు దీన్ని ఉపయోగించకోలేదు.నివాస అనుమతి గడువు తీరిన అక్కడే ఉంటున్నారు.ఇలాంటి వారిపై ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.చట్టం విరుద్ధంగా దేశంలో ఉంటూ పట్టుబడితే దేశం నుంచి బహిష్కరించడంతో పాటు జీవితంలో తిరిగి ఆ దేశానికి వెళ్లకుండా నిషేధం విధిస్తోంది.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com