బలపరీక్షకు హాజరు కావాలని ఉద్ధవ్​కు గవర్నర్​ ఆదేశం

- June 29, 2022 , by Maagulf
బలపరీక్షకు హాజరు కావాలని ఉద్ధవ్​కు గవర్నర్​ ఆదేశం

ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది.విదాన సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశించారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం రాత్రి గవర్నర్ ను కలసి, ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీంతో గవర్నర్ ఈ దిశగానే నిర్ణయాన్ని ప్రకటించారు.సభలో మెజారిటీ నిరూపణకు పెద్దగా సమయం కూడా ఇవ్వలేదు. ఈ నెల 30 నాటికి అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి ఉందని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. ఇందుకోసం ఈ నెల 30న సభ ప్రత్యేక సమావేశానికి ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం పూర్తి కావాలని, ఈ మొత్తాన్ని వీడియో తీయాలని గవర్నర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అస్పష్టంగా మారిందని గవర్నర్ పేర్కొన్నారు. తాము ఎంవీఏ సర్కారు నుంచి తప్పుకున్నట్టు 39 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు లేఖలు సమర్పించినట్టు తెలిపారు.సభలో విపక్ష నేత తనను కలసి ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినట్టు వివరించారని చెప్పారు. ఈ నేపథ్యంలో, గవర్నర్ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని ఉద్ధవ్ థాకరే భావిస్తున్నారు.సభలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ కోరొచ్చా? అనే దానిపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు శివసేన అసమ్మతి నేత ఏక్ నాథ్ షిండే తన మద్దతుదారులతో కలిసి అసోం రాజధాని గువాహటిలో మకాం వేయగా.. సభలో మెజారిటీ పరీక్ష ఉన్నందున రేపు తామంతా ముంబై చేరుకుంటామని ప్రకటించారు. కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆయన ఈ విషయం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com