‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ

- July 29, 2022 , by Maagulf
‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ

నటీనటులు: రవితేజ, దివ్యాంశ కౌశిక్, రజీష విజయన్, వేణు తొట్టెంపూడి, జాన్ విజయ్, నాజర్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి తదితరులు

దర్శకుడు: శరత మండవ,
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
సంగీతం: సామ్ పీఎస్

కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. మాస్ రాజా రవితేజ మార్కు యాక్షన్‌తో ప్రోమోలు కట్ చేసి, సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి ఆ అంచనాల్ని ‘రామారావు ఆన్ డ్యూటీ’ అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ: 
రామారావు (రవితేజ) నిజాయితీ గల గవర్నమెంట్ అధికారి. తను పని చేసే చోట ప్రజలకు అండగా వుంటూ, వారి కష్ట నష్టాలను తీరుస్తుంటారు. ఈ క్రమంలో రాజకీయ నాయకుల కోపానికి గురవుతూ బదిలీల మీద బదిలీలు అవుతుంటాడు. అలా చివరికి తాను పుట్టి, పెరిగిన ఊరికే బదిలీ మీద వస్తాడు. ఆ ఊరిలో తాను ఒకప్పుడు ప్రేమించి, కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయిన అమ్మాయి మాలిని (రజీష విజయన్)ని కష్టాల్లో వుందని తెలుసుకుంటాడు. ఆమె భర్త కనిపించడం లేదని తెలుసుకున్న రామారావు, అతన్ని వెతికే పనిలో పడతాడు. ఆ క్రమంలో అదే ఊరికి చెందిన మరో 20 మంది వ్యక్తులు అదృశ్యమయ్యారనీ తెలుసుకుంటాడు. వారి అదృశ్యం వెనక కారణాలేంటీ.? అసలు ఆ ఊళ్లో ఏం జరుగుతోంది.? మాలిని భర్తను రవితేజ వెతికి పట్టుకోగలిగాడా.? ఈ గుట్టు మట్టూ తెలియాలంటే సినిమా ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: 
రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏముంది. ఎలాంటి పాత్రనైనా హ్యాండిల్ చేయగలడు విత్ హై ఓల్టేజ్ ఎనర్జీ. కానీ, అలాంటి ఎనర్జీ కానీ, తనదైన మార్క్ యాక్టింగ్ స్కిల్ కానీ ఈ సినిమాలో కనిపించలేదంటే, అంతకన్నా ఆశ్చర్యం ఇంకోటి వుండదు. కొన్ని సీన్లలో అయితే, ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలో తెలియక బ్లాంక్ ఫేస్ పెట్టేశాడు రవితేజ. ఇది మరీ ఘోరం. ఇక హీరోయిన్ల గురించి అస్సలు మాట్లాడుకోకపోవడమే మంచిదేమో అనే భావన కలుగుతుంది. షార్ట్ ఫిలింస్, వెబ్ సీరీస్‌లలో నటించే హీరోయిన్లు నటనలో ఎంతో అనుభవం చూపిస్తున్నారు. అలాంటిది తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన అనుభవం వున్న రజీష కానీ, ‘మజిలీ’ వంటి మంచి తెలుగు సినిమాలో నటించిన దివ్యాంశ కౌశిక్ పాత్రలు ప్రెజెంట్ చేసిన విధానంలో డైరెక్టర్ పూర్తిగా ఫెయిలయ్యాడనే చెప్పాలి. ప్రధాన పాత్రల పనితీరే ఇలా వుంటే, ఇక మిగిలిన పాత్రల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. అన్నట్లు లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన వేణు తొట్టెంపూడి పాత్ర కూడా ప్రచారం చేసినంత గొప్పగా ఏం లేదు. మరీ పేలవంగా తయారైంది. 

సాంకేతిక వర్గం పని తీరు: 
తమిళంలో ఓ సినిమా చేసి, తెలుగులో సినిమా కోసం ఎదురు చూసిన శరత్ మండవకు దక్కిన అరుదైన అవకాశమిది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎంతో ఉత్సుకత ప్రదర్శించి వుండాలి సరికదా.. కనీసం కథపైన కూడా కాన్‌సన్‌ట్రేషన్ చేసినట్లు లేదు శరత్ మండవ. ఏ ఒక్క ఫ్రేమూ చెప్పుకునే విధంగా లేదు సినిమాలో. తెలుగు ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా రవితేజ మాస్ పల్స్‌ని పట్టడంలో నిరాశపరిచాడు శరత్ మండవ. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సామ్, అక్కడ థ్రిల్లర్ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ, తెలుగులో ‘రామారావు’ విషయంలో ఫెయిలయ్యాడు. సినిమా మొత్తానికి సత్యన్ సినిమాటోగ్రఫీ ఒక్కటే ఓకే అనిపిస్తుంది.

విశ్లేషణ:
రవితేజ మార్క్ సినిమా కాదిది అని, ‘రామారావు’ను ఓపెనింగ్ డేనే తేల్చేసినట్లయ్యింది. ప్రయోగాలు రవితేజకి పడవు.. అని గతంలో చాలా సార్లు ప్రూవ్ అయిపోయింది. అలాంటిది, కెరీర్ కాస్త డల్‌గా వున్న టైమ్‌లో రవితేజ ఇలాంటి సాహసాలు చేసి వుండకూడదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ నిజంగా పెద్ద సాహసమే రవితేజకు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అసలు కానే కాదిది. అలా అని ప్రచారంలో ఊదరగొట్టినట్లుగా ఏమంత కంటెంట్ రిచ్ సినిమా కూడా కాదు.
థ్రిల్లర్ నేపథ్యం అన్నారు. కానీ, ఆ థ్రిల్లింగ్ అంశాలు ఎక్కడా కనిపించనే కనిపించవ్ సినిమాలో. అసలు రవితేజ ఈ సినిమాలో నటించే ధైర్యం ఎందుకు చేశాడు.? అనే అనుమానాలు కలుగుతుంటాయ్ ప్రేక్షకుడిలో సినిమా చూస్తున్నంత సేపు. 

ప్లస్ పాయింట్స్ కన్నా, మైనస్ పాయింట్సే ఎక్కువ.. చివరిగా రామారావు ‘ఆఫ్’ డ్యూటీ.. అంతే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com