‘బింబిసార’ మూవీ రివ్యూ

- August 05, 2022 , by Maagulf
‘బింబిసార’ మూవీ రివ్యూ

నటీనటులు: కళ్యాణ్ రామ్, కేథరీన్, సంయుక్తా మీనన్, వరిన హుస్సేన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష, తదితరులు
డైరెక్టర్: వశిష్ట్
నిర్మాణం: ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్
సంగీతం: కీరవాణి

వరుస ఫ్లాపులతో అస్సలు ఫామ్‌లోనే లేడు ప్రస్తుతం కళ్యాణ్ రామ్. అలాంటిది ఓ కొత్త డైరెక్టర్‌ని నమ్మి, ఫాంటసీ కథకు సై అన్నాడు. ఈ కాన్సెప్ట్ కోసం కళ్యాణ్ రామ్ బాగా కష్టపడ్డాడు కూడా. కథను, డైరెక్టర్‌ని నమ్మి తన సొంత బ్యానర్‌లో నిర్మించేందుకు ముందుకొచ్చాడు కళ్యాణ్ రామ్. ఓ బాహుబలి, ఓ మగధీర వంటి ఫాంటసీ సినిమాల వరుసలో తన ‘బింబిసార’ కూడా నిలుస్తుందని ధీమాగా చెప్పేశాడు కళ్యాణ్ రామ్. మరి, ‘బింబిసార’ ఆ అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ: 
టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన స్టోరీ ఇది. క్రీపూ 500వ సంవత్సరం నుంచి, వర్తమానంలోకి నడిచే కథ. త్రిగర్తల సామ్రాజ్యానికి అధిపతి బింబిసారుడు. అత్యంత క్రూరమైన రాజు. తన కన్ను పడితే చాలు, ఆ రాజ్యాన్ని నిర్ధాక్షిణ్యంగా సొంతం చేసుకోవడమే ఈ రాజు లక్ష్యం. తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంలో బింబిసారుడు తన, పర బేధాలు కూడా చూడడు. అలా అధికారం కోసం తన సోదరుడు దేవదత్తుడ్ని సైతం హతమార్చే ప్రయత్నం చేస్తాడు బింబిసారుడు. ఎలాగో తప్పించుకున్న దేవదత్తుడికి, అనుకోకుండా మాయా అద్దం దొరుకుతుంది. ఆ మాయా అద్దం సాయంతో, బింబిసారుడికి చిక్కకుండా తండ్రి ఆకాంక్షల మేరకు కొన్నాళ్లు రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తుంటాడు. ఈ క్రమంలో మాయా అద్దం గురించి తెలుసుకున్న బింబిసారుడు దాన్నీ చేజిక్కించుకుంటాడు. అలా మాయా అద్దం ద్వారా కాలం గుండా ప్రయాణించి వర్తమానానికి చేరుకుంటాడు. వర్తమానంలో బింబిసారుడు అనేక విచిత్రమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు. తద్వారా అతనిలోని క్రూరత్వం అంచెలంచెలుగా మాయమైపోతుంది. మంచితనం అలవడుతుంది. ఇలా ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్.. ట్యాగ్ లైన్‌కి జస్టిఫికేషన్ జరుగుతుంది. అయితే, అంత క్రూరమైన రాజు మంచివాడిగా మారడానికి వర్తమానంలో ఎదురైన పరిస్థితులేంటీ.? బింబిసారుడు తిరిగి తన రాజ్యానికి వెళ్లగలిగాడా.? ఈ ప్రయాణంలో ధన్వంతరి వైద్య గ్రంధం ప్రస్థావన ఎందుకొచ్చింది.? బింబిసారుడి ద్వారా రహస్య ప్రదేశంలో వున్న ఆ ధన్వంతరి గ్రంధం దక్కించుకోవాలన్న దుండగుల ప్రయత్నం ఫలించిందా.? ఈ ఫాంటసీని ఫీలవ్వాలంటే ‘బింబిసార’ను ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
బింబిసారుడిగా ఫ్లాష్ బ్యాక్‌లోనూ, వర్తమానంలో మోడ్రన్ లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయ్. బింబిసారుడిగా నెగిటివ్ షేడ్స్‌ని చూపించడంలో కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఆ పాత్రను అంతలా ఓన్ చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. అయితే, బింబిసారుడి పాత్రను ప్రేక్షకుడు ఓన్ చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. కళ్యాణ్ రామ్ బేస్ వాయిస్, ఈ పాత్రకు బాగా హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని ప్రమోషన్లలో కళ్యాణ్ రామ్ చెప్పినదంతా నిజమే అనిపిస్తుంది. అంతలా ట్రాన్స్ ఫామ్ అయ్యాడు. ఇక, హీరోయిన్లుగా కేథరీన్ ఓకే అనిపిస్తుంది. కానీ, సంయుక్తా మీనన్ పాత్ర మాత్రం వృధా అయ్యిందనాలేమో. లుక్స్ పరంగానూ ఏమంత ఎట్రాక్ట్ చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది సంయుక్త విషయంలో. విలన్ రోల్ చేసిన వరిన హుస్సేన్ ఫర్వాలేదనిపిస్తాడు. అయ్యప్ప శర్మ తనకు బాగా అలవాటైన మాంత్రికుడి పాత్రలో ఒదిగిపోయాడు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు బాగానే అలరించారు.

సాంకేతిక వర్గం పని తీరు:
నిర్మాణ పరంగా పెద్దగా ఓవరాక్షన్ చేయలేదు. కానీ, ఉన్న వనరుల మేరకు విజువల్‌‌లో భారీతనం ఎలివేట్ అయ్యేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. ముఖ్యంగా ఈ తరహా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రాణంలాంటిది. కీరవాణి మ్యూజిక్‌తో ఆ ప్రాణం పదిలంగా వుంది. బాహుబలి తరహా ఆర్ఆర్‌ని చొప్పించే ప్రయత్నం చేశాడు కానీ, సీన్స్ ఎలివేషన్స్‌లో చూస్తున్నంత సేపూ ఆ ఇంపాక్ట్ క్రియేట్ కాదు. సినిమాకి పాటలు స్పీడ్ బ్రేకర్లలా అనిపిస్తాయ్. సంభాషణలు బాగున్నాయ్. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ వర్క్ బాగుంది. 
ఇక డైరెక్టర్ విషయానికి వస్తే, ఇలాంటి సినిమాలను వర్తమానంలో స్టార్ట్ చేసి, ఫ్లాష్ బ్యాక్‌లోకి తీసుకెళతారు. కానీ, అందుకు భిన్నంగా ‘బింబిసార’ డైరెక్టుగా టైటిల్ కాన్సెప్టుతోనే కథను స్టార్ట్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా వుండలేం. ప్రమోషన్ మెరుగులే.. అనే అభిప్రాయానికి తావివ్వకుండా, తాను అనుకున్న బలమైన కథని ప్రొజెక్ట్ చేయడంలోనూ అంతే బలం చూపించాడు. మాయా అద్దం, టైమ్ ట్రావెలింగ్, ధన్వంతరి వైద్య గ్రంధం, రహస్య ప్రదేశం.. ఇలా చందమామ కథలో చదువుకున్న ఫాంటసీ మూమెంట్స్ ‘బింబిసార’లో చాలానే వున్నాయ్. నయా ట్రెండ్‌ ఆడియన్స్‌ని టైమ్ ట్రావెలింగ్ పేరు చెప్పి, సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు బింబిసారుడు. ఓ కొత్త డైరెక్టర్ నుంచి ఇలాంటి పనితనాన్ని ఊహించలేం. అక్కడే మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ వశిష్ట్. అక్కడక్కడా చిన్నచిన్న లోపాలున్నప్పటికీ కొత్త డైరెక్టర్, ‘ఫాంటసీ’ కాన్సెప్ట్ ఖాతాలో కొట్టుకుపోతాయ్.

ప్లస్ పాయింట్స్:
కళ్యాణ్ రామ్ నటన,
ఊహించని డిఫరెంట్ స్క్రీన్ ప్లే, 
ఆకట్టుకునే పతాక సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:
కాస్త సాగతీతగా మారిన సెకండాఫ్,
సీరియస్ కథకి స్పీడు బ్రేకర్లలా మారిన పాటలు

చివరిగా: 
‘బింబిసార’ ఓ మాంచి ఫాంటసీ ఫీలింగ్ మూవీ. ఓకే.! పెట్టిన టిక్కెట్టుకు ‘విజువల్’ వసూల్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com