‘కార్తికేయ 2’ మూవీ రివ్యూ

- August 13, 2022 , by Maagulf
‘కార్తికేయ 2’ మూవీ రివ్యూ

తారాగణం: నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్యా మీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు.
డైరెక్షన్: చందూ మొండేటి
నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్,
సంగీతం: కాల భైరవ
ఎడిటింగ్: కార్తీక్ ఘట్టమనేని.
రిలీజ్ డేట్: 13.08.2022

ఈ వారం ధియేటర్లో ఆల్రెడీ రెండు సినిమాలు సందడి చేశాయ్. ‘లాల్ సింగ్ చద్దా’ ఒకటి, ‘మాచర్ల నియోజక వర్గం’ ఇంకోటి. అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్‌కి కళ తీసుకురాలేకపోయాయ్. ఆ కోవలో సమ్‌థింగ్ డిఫరెంట్ పంథాలో తెరకెక్కింది ‘కార్తికేయ 2’. వాయిదాల మీద వాయిదాల పర్వం ముగించుకుని తాజాగా ధియేటర్లోకి వచ్చింది. ఫాంటసీ నేపథ్యమున్న ‘కార్తికేయ 2’ మరి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథ:
కార్తికేయ (నిఖిల్) ఓ డాక్టర్. ప్రశ్నల చుట్టూ ప్రయాణం చేసే వ్యక్తి. ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే చాలా ఇష్టం. విశ్వంలోని ప్రతీ ప్రశ్నకూ సమాధానం ఖచ్చితంగా వుంటుందని బలంగా నమ్ముతాడు. తన దాకా రానంత వరకే సమస్య, వస్తే, దానికి సమాధానం దొరకాల్సిందే. అందుకోసం ఎంత దూరం ప్రయాణించడానికైనా సిద్ధం.. అనేలా వుంటాడు కార్తికేయ. అలా తల్లి మొక్కు తీర్చడం కోసం ద్వారక వెళతాడు కార్తికేయ. ఆ ప్రయాణంలో ఓ ఆర్కియాలజిస్ట్ మర్డరీ మిస్టరీ గురించి తెలుసుకుంటాడు. ఈ ప్రయాణంలోనే ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్) పరిచయమవుతుంది. అసలు చనిపోయిన ఆ ఆర్కియాలజిస్ట్ ఎవరు.? ఆయన చావుకు కారణం ఏంటీ.? కార్తికేయ ప్రయాణానికీ, కృష్ణుడి చరిత్రకీ సంబంధం ఏంటీ.? అనేది తెలియాలంటే, ‘కార్తికేయ 2’ ధియేటర్లో చూడాల్సిందే.

నటీనటుల పని తీరు:
‘కార్తికేయ’ లో మెడికల్ స్టూడెంట్‌గా ఎంత చక్కగా ఒదిగిపోయాడో నిఖిల్. అదేవిధంగా, ‘కార్తికేయ 2’ కోసం డాక్టర్‌గానూ తన పాత్రలో మెచ్యూరిటీ లెవల్స్ అలాగే చూపించాడు. అయితే, కథ పరంగా మొదటి పార్ట్‌కీ, రెండో పార్ట్‌కీ అస్సలు సంబంధం వుండదు. ఈ సారి శ్రీ కృష్ణుడి పాత్ర చుట్టూ కథను అల్లుకున్నాడు దర్శకుడు. తన కథను అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నిఖిల్ కథను పూర్తిగా తన భుజాలపై మోశాడు. అనుపమ పరమేశ్వరన్ ఎప్పటిలాగే తన పాత్రకు న్యాయం చేసింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తన సీనియారిటీని రంగరించి చూపించాడు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తమ పాత్రల పరిధి మేరకు నటిస్తనూ, అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు. ఆదిత్య మీనన్, తులసి, ప్రవీణ్ తదితరులు పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:
కథా బలం వుంటే, ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుందని ‘కార్తికేయ 2’తో మరోసారి ప్రూవ్ అయ్యింది. తను చెప్పాలనుకున్న కథని కమర్షియల్ హంగులకు పోకుండా డైరెక్ట్‌గా ప్రేక్షకులకు కన్‌వే చేయడంలో చందూ మొండేటి సక్సెస్ అయ్యాడు. పాటల విషయంలో అస్సలు కక్కుర్తి పడలేదు. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత బలమైంది. కార్తికేయ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ పరంగా సినిమా చాలా వున్నతంగా కనిపించింది. 

విశ్లేషణ:
ప్రతీ ఫ్రేమ్‌లోనూ డైరెక్టర్‌కి సినిమాపై వున్న ప్రేమ జాగ్రత్త కనిపిస్తుంటుంది. అక్కడక్కడా సినిమాటిక్ లిబర్టీ ఉపయోగించాల్సి వచ్చినా, కథా బలంతో, కథనాన్ని చివరి వరకూ ఉత్కంఠగా నడిపించడంలో చందూ మొండేటి హండ్రడ్ పర్సంట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. మొదటి అర్ధ భాగంలో చనిపోయిన ఆర్కియాలజిస్ట్ పరిశోధనల ఆధారంగా కార్తికేయ చేసే ప్రయాణం ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లూ, అనూహ్యమైన ట్విస్టులు ప్రేక్షకుడ్ని సెకండాఫ్‌పై మరింత ఉత్కంఠ పెంచేలా చేస్తాయ్. ద్వితీయార్ధంలో కథ కృష్ణుడి చుట్టూ నడుస్తుంది. ఇక, ద్వితీయార్ధంలో సాగే సన్నివేశాలూ, కథానాయకుడి ప్రయాణం ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతూ, ఆ ప్రపంచంలోకి నెట్టేస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు, మరో కథకు ఆరంభాన్ని సూచిస్తూ ముగుస్తాయ్. 

ప్లస్ పాయింట్స్:
నిఖిల్ పర్‌ఫామెన్స్
కథ, కథనం, స్క్రీన్‌ప్లే

మైనస్ పాయింట్స్: 
పెద్దగా లేవు కానీ, ఫస్టాఫ్‌లో కొన్ని సినిమాటిక్ అంశాలు అంతే.

చివరిగా:
రెండో కార్తికేయుడి కొత్త ప్రయాణం ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని పంచే వినోదం, విజ్ఞానం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com