ఆసియా కప్‌‌కు రంగం సిద్ధం..

- August 27, 2022 , by Maagulf
ఆసియా కప్‌‌కు రంగం సిద్ధం..

యూఏఈ: ఆసియాకప్ క్రికెట్ సమరానికి వేళైంది.. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ ఇవ్వాల్టీ నుంచి ప్రారంభం కానుంది. ఆరు జట్లు పాల్గోననున్న ఈ టోర్నీలో 16రోజుల్లో మొత్తం 13 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇవాళ రాత్రి 7.30గంటలకు శ్రీలంక వర్సెస్ ఆఫ్గానిస్థాన్ జట్ల మధ్య తొలిపోరు జరుగనుంది. అయితే ఇప్పటి వరకు ఆసియా కప్‌ను 14 సార్లు నిర్వహించారు. 1984 నుంచి 2018 మధ్య ఈ టోర్నమెంట్లు జరిగాయి. అత్యధికంగా 7సార్లు భారత్ విక్టరీ కొట్టగా.. శ్రీలంక ఐదు సార్లు, పాకిస్థాన్ రెండు సార్లు ట్రోపీని అందుకున్నాయి. ఇక టీ20 ప్రపంచ కప్‌కు ముందు ఈ టోర్నీ జరగుతుండడంతో అన్ని జట్లు సత్తా చాటేందుకు రెడీగా ఉన్నాయి. ఆసియా కప్ టోర్నీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేంది భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య పోరే. క్రికెట్ అభిమానులు ఈ రెండు జట్ల మధ్య జరిగే సమరంకోసం ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ఈసారి టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు మూడు సార్లు తలపడే ఛాన్స్ ఉంది. రేపు రాత్రి భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సూపర్ -4 కు అర్హత సాధిస్తే మరోసారి అక్కడ తలపడతాయి. గత ఏడాదిగా నిలకడగా విజయాలు సాధిస్తున్న పాక్ మంచి ఫామ్‌లో ఉంది. చివరగా పదేళ్ల క్రితం ఆసియా కప్ గెలిచిన ఆ జట్టు ఈసారి సత్తాచాటి టోర్నీ గెలుచుకోవాలని చూస్తోంది. ఇటు డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. 2018లో వన్డే ఫార్మాట్ లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. ఇప్పుడు కూడా ఇండియా ఆటగాళ్లు సైతం మంచి ఫామ్ లో ఉండటంతో రేపు జరిగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య పోరు క్రికెట్ అభిమానులకు మంచి కిక్‌ ఇచ్చేలా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com