రామాయణ స్ఫూర్తితోనే భారతదేశం ముందుకెళ్తోంది: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

- October 19, 2022 , by Maagulf
రామాయణ స్ఫూర్తితోనే భారతదేశం ముందుకెళ్తోంది: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: నాటి నుంచి నేటి వరకు రామాయణ స్ఫూర్తితోనే భారతదేశం ముందుకెళ్తోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని ఇకపైనా కొనసాగించే దిశగా నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
 
బుధవారం ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఆధ్వర్యంలో జరిగిన ఆరవ అంతర్జాతీయ రామాయణ్ ఉత్సవ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఆధ్యాత్మిక సంస్కృతి గురించి తెలుసుకుని ఆచరించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని, అందుకే భారతదేశ పర్యాటక పురోగతిలో ఆధ్యాత్మిక పర్యాటకం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారిందని ఆయన పేర్కొన్నారు.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజచేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, రామమందిర నిర్మాణం శతాబ్దాలుగా భారతీయుల కలగా తీరిపోయిందన్నారు. రామాయణంతో సంబంధమున్న ప్రాంతాలను రైలు మార్గం ద్వారా కలిపే రామాయణ సర్క్యూట్ కు మోదీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని ఆయన అన్నారు. 
భారతదేశానికి మాత్రమే కాకుండా మన పొరుగుదేశాలైన శ్రీలంక, నేపాల్, తూర్పు పసిఫిక్ దేశాలైన మయన్మార్, ఇండోనేషియా, థాయ్ లాండ్, మలేషియాతోపాటుగా పసిఫిక్ దేశమైన ఫిజీ, కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్ అండ్ టొబాగో వంటి దేశాలకు కూడా రాముడు, రామాయణం స్ఫూర్తిదాయకమేనని.. ఆయా దేశాల్లో ఇప్పటికీ రామాయణానికి విశేషమైన ఆదరణ ఉందన్నారు.
 
ఈ సందర్భంగా భారత్, శ్రీలంక, ట్రినిడాడ్ అండ్ టొబాగో కు చెందిన కళాకారులు ప్రదర్శించిన రామాయణ కళారూపాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఐసీసీఆర్ ప్రెసిడెంట్ వినయ్ సహస్రబుద్ధే, వివిధ దేశాల అంబాసిడర్స్ తదితరులు పాల్గొన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com