‘ఆఫ్రికన్ గ్యాంగ్ ఎటాక్’ వీడియోలతో బహ్రెయిన్‌లో భయాందోళనలు

- October 21, 2022 , by Maagulf
‘ఆఫ్రికన్ గ్యాంగ్ ఎటాక్’ వీడియోలతో బహ్రెయిన్‌లో భయాందోళనలు

బహ్రెయిన్: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న ‘ఆఫ్రికన్ గ్యాంగ్ ఎటాక్’ వీడియోలు బహ్రెయిన్‌లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఆఫ్రికన్ దేశాల జాతీయులు వివిధ వీధుల గుండా వెళుతూ దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు చూపించే అనేక వీడియోలు ప్రజలలో భయాందోళనలను కలిగిస్తున్నాయి.  మరోవైపు ఈ వీడియోలు బహ్రెయిన్ లో తీసినవి కావని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆఫ్రికన్ దేశాల జాతీయుల దోపిడీ, వికృత ప్రవర్తన, భిక్షాటన గురించి మీడియాలలో అనేక కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆఫ్రికన్ దొంగల చేతిలో భయంకరమైన దాడికి గురై తృటిలో తప్పించుకున్న టాక్సీ డ్రైవర్‌ ఉదంతం కూడా నెట్టింట వైరల్ అవుతోంది. బహ్రెయిన్ నివాసి అలీ జంషీద్ మాట్లాడుతూ.. ఆఫ్రికన్ ముఠాల కారణంగా తలెత్తిన భయాలను తొలగించుందకు బహ్రెయిన్ పోలీస్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, అలాంటి ముఠాలను అరెస్టు చేయాలని కోరారు. ఇటువంటి సంఘటనలు చాలా మంది ఆఫ్రికన్ జాతీయుల ఇమేజ్‌కు ప్రతికూలంగా మారుతుందని, వారు రాజ్యంలో నివసిస్తూ..ఇక్కడి చట్టాలకు కట్టుబడి ఉన్నారని మరొక బహ్రెయిన్ నివాసి అభిప్రాపడ్డారు. మరోవైపు మెరుగైన అవకాశాలు, ఉద్యోగాల కల్పిస్తామని నైజీరియా, ఘనా, కామెరూన్ వంటి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు చెందిన వందలాది మంది యువకులను మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసాలపై తీసుకొచ్చి కొన్ని ముఠాలు మోసగిస్తున్నాయని 23 ఏళ్ల నైజీరియన్ జాతీయుడు వాపోయాడు. తాను బహ్రెయిన్ చేరుకునేందుకు లాగోస్‌లోని ఒక ఏజెంట్‌కి 1.5 మిలియన్ నైజీరియన్ నైరా (BD1,350) చెల్లించానని తెలిపాడు. బహ్రెయిన్ చేరుకున్న తర్వాత తనకు BD400 - BD500 మధ్య వేతనాలతో ఉద్యోగాలు అందిస్తామని చెప్పారని, ఇప్పటికి ఒక నెల గడిచినా ఉద్యోగం కల్పించలేదన్నాడు. వీసా మోసగాళ్లు ఆఫ్రికా నుంచి మాత్రమే కాకుండా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా దక్షిణాసియా దేశాలకు చెందిన ఉద్యోగార్థులను కూడా మోసం చేస్తున్నాయని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఇటీవల మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు కింగ్డమ్ అధికారులు చర్యలను వేగవంతం చేశారు. పర్యాటక వీసాల కోసం BD300 కనీస ఖాతా బ్యాలెన్స్‌తో బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను సమర్పించడంతోపాటు సందర్శకుడు రిటర్న్ టిక్కెట్‌లతో పాటు హోటల్ బుకింగ్ పత్రాలను కూడా సమర్పించాలని నిబంధన విధించారు. అలాగే వారి కుటుంబ సభ్యులను సందర్శించే వ్యక్తులు తప్పనిసరిగా విద్యుత్ / నీటి బిల్లుల కాపీలతో పాటు నివాసి CPR కాపీని సమర్పించాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com