తెలంగాణలో కుటుంబ పాలన పోవాల్సిందేనన్న ప్రధాని మోడీ

- November 12, 2022 , by Maagulf
తెలంగాణలో కుటుంబ పాలన పోవాల్సిందేనన్న ప్రధాని మోడీ

హైదరాబాద్: హైదరాబాద్‌: బేగంపేటలో బిజెపి నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబ పాలన పోవాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని… దేశంలో ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అక్కడ కమలం వికసిస్తుందని అన్నారు. అవినీతి, కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి మొదటి శత్రువని మోడీ చెప్పారు. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు బిజెపి సిద్ధంగా ఉందని అన్నారు. పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తెలంగాణలో చీకటి తొలగిపోయే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. హైదరాబాద్ ఐటీకి కేరాఫ్ అడ్రస్ అని… ఇలాంటి నగరంలో టిఆర్ఎస్ పార్టీ మూఢనమ్మకాలను పెంచి పోషిస్తోందని విమర్శించారు. మూఢనమ్మకాలు అభివృద్ధికి అవరోధకాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బిజెపి శ్రేణులు ప్రజలకు వివరించాలని మోడీ సూచించారు. కొందరు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని… వారి తిట్లను తాను పట్టించుకోనని అన్నారు. ఎన్నో ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని… రోజుకు మూడు కేజీల తిట్లు తింటానని చెప్పారు. ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని అన్నారు. తనను తిడితేనే రైతులు బాగుపడతారంటే… తిట్లు తినడానికి తాను సిద్ధమని చెప్పారు. తెలంగాణ ప్రజలను తిడితే మాత్రం సహించేది లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని మోడీ హెచ్చరించారు. పసుపు రైతులను టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమను వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పారు.

1984లో బిజెపికి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని… వీరిలో ఒకరు తెలంగాణ నుంచి గెలిచారని చెప్పారు. అప్పడు హన్మకొండ నుంచి జంగారెడ్డిని ప్రజలు గెలిపించారని తెలిపారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిలో పరుగులు పెడుతుందని మోడీ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పీఎం ఆవాస్ యోజన పథకాన్ని టిఆర్ఎస్ పథకం అడ్డుకుందని విమర్శించారు. బిజెపిపై ముగుగోడు ప్రజలు వ్యక్తపరిచిన నమ్మకం అపూర్వమైనదని మోడీ అన్నారు. ఒక్క అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు మొత్తం తెలంగాణ ప్రభుత్వాన్నే ఒకే చోటుకు చేర్పించిన ఘనత బిజెపి కార్యకర్తలదని కితాబిచ్చారు. ప్రజల ఆశీస్సులు మీకు ఉన్నాయనే విషయం దీంతో అర్థమవుతోందని… మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతోందని అన్నారు. తెలంగాణ ప్రజలు అత్యంత ఎక్కువగా నమ్మిన పార్టీ (TRS)… చివరకు ఆ ప్రజలను దారుణంగా మోసం చేసిందని విమర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com