ఒమన్ లో అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణం

- November 20, 2022 , by Maagulf
ఒమన్ లో అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణం

మస్కట్: అది అంతర్వేది, అహోబిలం, సింహాచలం కాదు. పోనీ ధర్మపురినా అనుకుంటే అది కూడా కాదు.యాదగిరిగుట్ట అంతకన్నా కాదు కాని యాదాద్రిని తలపించే విధంగా ఒమన్ దేశం మస్కట్లో తెలంగాణ ప్రవాసులు నిర్వహించిన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణం.

వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆ పరిసరాలు మార్మోగుతుండగా అచ్చం యాదగిరిగుట్టను తలపించింది.ఈ సన్నివేశం మస్కట్‌లోని దారసైత్‌లో ఉన్న శ్రీ కృష్ణా ఆలయంలో గత శుక్రవారం కన్నుల పండుగా జరిగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం సందర్భంగా చోటు చేసుకుంది.

ఒమన్‌లో నిర్వహించిన ఈ వేడుక కోసం పంచ నారసింహులు స్వయంభువులుగా కొలువైన క్షేత్రం యాదగిరిగుట్ట నుంచి  ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అర్చకుల బృందం తరలి వచ్చింది. అరబ్బు నేల దేవదేవుడి కల్యాణ క్రతువు వేళ సంప్రదాయ హంగులతో మెరిసిపోగా, కల్యాణాన్ని వీక్షించేందుకు దధపు రెండు వేలకు (2000) పైగా వివిధ రాష్ట్రాల ప్రవాసీ భక్తజనం పోటెత్తింది. తెల్లవారుజామున అయిదుగంటల నుండి ప్రారంభమైన శ్రీ లక్ష్మినరసింహాస్వామి సుప్రభాతం కంటే ముందుగానే.. ‘ఓం నమో నారసింహాయ’ అనే నామస్మరణతో వందలాది కిలో మీటర్లను కూడా లెక్క చేయకుండా.. సుదూర ఎడారి విలాయత్ల (రాష్ట్రాలు) నుంచి భక్తులు చేరుకొన్న తీరు భక్తి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించింది.

యాదిగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్గంథీగల్ లక్ష్మినరసింహాచార్యులు నేతృత్వంలో మంగళగిరి నర్సింహామూర్తి ఇతర అర్చకుల బృందం ఆధ్వర్యంలో జరిగిన తిరుకళ్యాణ మహోత్సవ కమనీయ దృశ్యంతో ప్రవాసీయుల హృదయం పరవశించింది.యాదాద్రి క్షేత్ర మహాత్యం వివరణను భక్తులు శ్రధ్ధగా ఆలకించారు.అలాగే ప్రధాన అర్చకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపడుతున్న యాదాద్రి పుణ్యక్షేత్ర అభివృద్ధి గురుంచి క్లుప్తంగా భక్తులకు తెలియజేసి ప్రతి ఒక్కరు యదగిరిగుట్ట కి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకోమనరు.​ఉత్సవమూర్తులను కూడా ప్రత్యేక అర్చకుల బృందం ఆలయ సుపెరిటెండెంట్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గల్ఫ్‌కు తీసుకొచ్చింది.మస్కట్‌లోని శ్రీ కృష్ణ ఆలయాన్ని ఒమన్ ప్రభుత్వ ధార్మిక వ్యవహారాలు మరియు వక్ఫ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ఒక ట్రస్ట్ నిర్వహిస్తోంది. దారసత్ మందిర్‌గా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com