సింగపూర్ లో శతాబ్దిగాయకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

- November 24, 2022 , by Maagulf
సింగపూర్ లో శతాబ్దిగాయకుడు ఘంటసాల శతజయంతి ఉత్సవాలు

శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్- ఇండియా, ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో, అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు సింగపూర్లో డిసెంబర్ 4వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. 

"గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించి, 366 రోజుల పాటు నిర్విరామంగా అంతర్జాల మాధ్యమంలో  నిర్వహిస్తూవస్తున్న 'ఘంటసాల స్వరరాగ మహాయాగం' కార్యక్రమం యొక్క సమాపణోత్సవం, సింగపూర్ లో ఘంటసాల శతజయంతి రోజున నిర్వహిస్తున్నామని, దీనికై భారతదేశం నుండి వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు, శుభోదయం గ్రూప్ చైర్మన్ డాక్టర్ శ్రీలక్ష్మీ ప్రసాద్ కలపటపు, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, చంద్రతేజ, సురేఖ మూర్తి వంటి ప్రముఖ నేపద్య గాయనీ గాయకులు, వాద్య కళాకారులు, హాంకాంగ్ నుంచి జయ పీసపాటి, తదితర అతిథులు హాజరు కానున్నారని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారని" శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు  తెలియజేశారు. 

భారతదేశం నుండి వస్తున్న ప్రముఖ గాయని గాయకులచే ప్రత్యేక సంగీత విభావరితో పాటు 
శుభోదయం ఆధ్వర్యంలో నిర్మించబడిన 'ఘంటసాల ది గ్రేట్' బయోపిక్ ట్రైలర్ ఆవిష్కరణ, వంగూరి ఫౌండేషన్ వారి 'మన ఘంటసాల' పుస్తకావిష్కరణ అదనపు ఆకర్షణలుగా అలరించబోతున్నాయి. 

రాధిక మంగిపూడి ఈ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరిస్తుండగా, సింగపూర్ గాయనీ గాయకులు అలనాటి పాటలను పాడి ఘంటసాలవారికి జోహార్లు అర్పించనున్నారు. సింగపూర్లో Punggol లోని GIIS  ప్రాంగణంలో సుమారు 5 గంటలపాటు జరగబోతున్నఈ కార్యక్రమానికి సింగపూర్ తెలుగు ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామని నిర్వాహక బృంద సభ్యులు పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com