కువైట్ ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘భారత రాజ్యాంగ దినోత్సవం’

- November 27, 2022 , by Maagulf
కువైట్ ఇండియన్ ఎంబసీలో ఘనంగా ‘భారత రాజ్యాంగ దినోత్సవం’

కువైట్: భారత రాయబార కార్యాలయంలో 72వ రాజ్యాంగ దినోత్సవాన్ని (సంవిధాన్ దివస్) నవంబర్ 26న ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న  భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఎంబసీ ఛార్జ్ డి' అఫైర్స్ (Cd'A) స్మితా పాటిల్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం భారతదేశంలోని ప్రతి పౌరుడికి పండుగ లాంటిదన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత ప్రజాస్వామ్యానికి పునాది రాజ్యంగం అని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైన భారత రాజ్యాంగం భారతీయులకు ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుందన్నారు. తన ప్రసంగంలో 26 నవంబర్ 2008న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. అలాగే కువైట్‌లోని భారతీయ ప్రవాసుల ఇండియాలోని మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జనవరి 8-10 తేదీల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్-2023 (PBD)లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కువైట్‌లోని భారతీయ విద్యార్థులు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, తమిళం, తెలుగు, ఉర్దూ వంటి 16 విభిన్న భారతీయ భాషల్లో భారత రాజ్యంగ ప్రవేశికను చదివి వినిపించారు. భారత రాజ్యాంగ నిర్మాణంపై నిర్వహించిన ఎగ్జిబిషన్ ఆహుతులను ఆకట్టుకున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com