కరోనా పై ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం..

- December 22, 2022 , by Maagulf
కరోనా పై ప్రధాని అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం..

న్యూ ఢిల్లీ: కరోనాపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో కరోనా విజృంభించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని మోదీ అన్నారు.

కరోనా పరీక్షలను మరింత పెంచాలని సూచించారు. కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని, కరోనా ప్రీకాషన్ డోసులను ప్రోత్సహించాలని చెప్పారు. దేశంలో ఔషధాలు, వాక్సిన్లు, ఆసుపత్రి బెడ్లు కావాల్సినన్ని ఉన్నాయని చెప్పారు. అవసరమైన ఔషధాలు, వాటి ధరల గురించి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అన్నారు.

దేశంలో ప్రస్తుతం సగటున రోజువారీ కరోనా కేసులు 153 మాత్రమే నమోదవుతున్నాయని, వారాంతపు పాజిటివిటీ రేటు 0.14 శాతానికి తగ్గిందని చెప్పారు. అయితే, గత 6 నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయిందని, సగటున రోజువారీ కరోనా కేసులు 5.9 లక్షలుగా నమోదవుతున్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో భారత్ లో కరోనా విజృంభిస్తే సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల వైద్య పరికరాలు, వైద్య సిబ్బందిని సమకూర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com