సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు

- December 23, 2022 , by Maagulf
సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ ఇక లేరు

హైదరాబాద్:  ప్రముఖ సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 87 సంవత్సరాలు.

కైకాల మృతితో తెలుగు చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు.

కృష్ణా జిల్లా కౌతారం గ్రామంలో 1935లో జన్మించిన సత్యనారాయణ గుడివాడ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశారు. నటన పై ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ ఆయనలోని ప్రతిభను గుర్తించి తొలిసారి ‘సిపాయి కూతురు’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పౌరాణిక, జానపద, కమర్షియల్ సినిమాల్లో హీరోగా, విలన్‌గా నటించి అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుతోపాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి నటులతోనూ సత్యనారాయణ నటించారు. 

60 ఏళ్లకు పైగా నట జీవితంలో దాదాపు 800 చిత్రాల్లో నటించారు కైకాల. ఒక విలన్ గా, క్యారెక్టర్ నటుడిగా, కమెడియన్ గా విభిన్న పాత్రల్లో మెప్పించారు.

కైకాల సత్యనారాయణ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు కూడా. రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసి లోక్ సభలో అడుగుపెట్టారు.

రేపు అంత్యక్రియలు జరుగుతాయి. కైకాల సత్యనారాయణ ఇక లేరు అన్న వార్త టాలీవుడ్ ను శోకసంద్రంలో ముంచింది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com